Begin typing your search above and press return to search.

కేసీఆర్ ని పొగిడితే వృద్ధాప్యంలో ఉన్నట్లా?

By:  Tupaki Desk   |   14 Nov 2015 9:31 AM GMT
కేసీఆర్ ని పొగిడితే వృద్ధాప్యంలో ఉన్నట్లా?
X
వ్రతం పట్టి మరీ.. మీడియాతో మాట్లాడటం మానేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ సత్యనారాయణ అలియాస్ ఎమ్మెస్సార్. శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గురించి నాలుగు మంచి మాటలు చెప్పేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా సాగుతున్న ఆయన.. తనకు తోచిన మాటలు చెప్పారు. క్రియాశీలక రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ.. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్న పెద్దాయనకు.. కేసీఆర్ పాలనలో మంచి కోణం కనిపించి నాలుగు మాటలు చెప్పేశారు.

ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కష్టంగా మారింది. ఏం జరిగినా పట్టనట్లు ఉండే ఎమ్మెస్సార్.. కేసీఆర్ ను ఎలా పొగిడేస్తారంటూ? పెద్ద లాపాయింట్ తీశారు. ఇలా లా పాయింట్లు తీసేవారితో పాటు.. ఎమ్మెస్సార్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేతలూ ఉన్నారు. ఇదిలా ఉంటే.. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే.. తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎమ్మెస్సార్ వృద్ధాప్యంలో ఉన్నారని.. అందువల్ల కేసీఆర్ పాలన మీద అవగాహన లేకనే అలా మాట్లాడి ఉంటారంటూ కాస్త చురుకుపుట్టే వ్యాఖ్యలు చేశారు.

గుత్తా మాటలు విన్న వారు కాస్తంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అంతర్గత కలహాలతో కొట్టుకు చచ్చే కాంగ్రెస్ పార్టీ నేతల్లో నిజంగా కమిట్ మెంట్ ఉంటే.. కలిసి పోరాడి కేసీఆర్ సర్కారు మీద ఒత్తిడి తీసుకురావాలే కానీ.. పెద్దమనిషిగా ఉండే పాతతరం ఎమ్మెస్సార్ లాంటి నేతల మీద అంతంత మాటలు అనటం ఏమిటంటూ మండి పడుతున్నారు.

మరికొందరైతే.. ఎమ్మెస్సార్ లాంటి నేతలకు కానీ మండి.. నోరు విప్పితే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో పలువురు బజార్ లో కూడా తిరగలేరని విరుచుకుపడుతున్నారు. ఒక సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై పోస్ట్ మార్టం చేసే కన్నా.. కామ్ గా ఉండిపోతే సరిపోతుందని.. అనవసరంగా మాట్లాడటం ద్వారా ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యల కంటే ఎక్కువ నష్టం చేస్తున్నారంటూ కొత్త తరహా వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. తనపై విమర్శలు చేస్తున్న నేతల నోళ్లు మూతపడేలా ఎమ్మెస్సార్ ఒక్కసారి గొంతు సవరించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. ఇలాంటి వారి కోరికను ఎమ్మెస్సార్ తీరుస్తారో లేదో చూడాలి.