Begin typing your search above and press return to search.

కేసీఆర్ తాజా నిర్ణయంతో గుత్తాకు దెబ్బ పడినట్లేనా?

By:  Tupaki Desk   |   4 Aug 2021 4:46 AM GMT
కేసీఆర్ తాజా నిర్ణయంతో గుత్తాకు దెబ్బ పడినట్లేనా?
X
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఏ మాత్రం అంచనా వేయలేమంటారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం చూస్తే ఈ విషయం ఎంత నిజమన్నది ఇట్టే అర్థమవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న పదవి.. కళ్ల ముందు నుంచి చేజారిపోతుంటే ఉండే వేదన అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. నల్గొండ జిల్లా వరకు రాజకీయాల మీద ప్రభావం చూపే సీనియర్ నేతల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకరు. టీఆర్ఎస్ లోకి చేరిన ఆయనకు పదవిని ఇవ్వటం తెలిసిందే. తాజాగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని అధినేత కేసీఆర్ అప్పజెబుతారని అందరూ అంచనా వేస్తున్న వేళ.. ఆయనకు అనుకోని షాక్ తగిలింది.

గవర్నర్ కోటాలో గుత్తాను నియమిస్తారని భావించారు. కానీ.. పాడె కౌశిక్ రెడ్డి ఉదంతంలో.. సీఎం కేసీఆర్ ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని ప్రకటించటంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. గవర్నర్ కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీ స్థానాలపై సీనియర్లు.. ఆశావాహులు పెద్ద ఎత్తున ఆశలుపెట్టుకున్నారు. ఎప్పటి నుంచో ఈ పదవుల కోసం వెయిట్ చేస్తున్న వారికి భిన్నంగా.. పాడె కౌశిక్ ను ఎంపిక చేయటాన్నిజీర్ణించుకోలేకపోతున్నారు. అలా అని.. తమ వేదనను బయటపెట్టుకోలేని పరిస్థితి.

తాజా పరిణామంతో గులాబీ దళంలో కొత్త వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల మాటేమిటన్నది ప్రశ్నగా మారింది. పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారిని వదిలేసి.. పార్టీలోకి వచ్చినంతనే పదవులు ఇవ్వటం ఎంతవరకు సబబు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలాఉంటే.. గుత్తాకు ఈసారి మొండి చేయి తప్పదా? అన్నది ప్రశ్నగా మారింది. కారణం..సాగర్ ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేత కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.

ఒకవేళ అదే నిజమనుకుంటే.. ఒకే జిల్లాకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి ఒకేసారి పదవులు ఇవ్వటం సాధ్యమా? అన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. గవర్నర్ కోటాలో గుత్తాకుకేటాయిస్తే.. ఎమ్మెల్యేల కోటాలో కోటిరెడ్డికి సర్దుబాటు చేసే అవకాశం ఉందని.. ఇప్పుడు అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటంతో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల్ని చూస్తే.. గుత్తాకు షాక్ తప్పదంటున్నారు. మొత్తంగా కేసీఆర్ తీరును.. ఆయన పదవుల పంపకాన్ని పలువురు తప్పు పడుతున్న పరిస్థితి నెలకొంది. కానీ.. తమ భావాల్ని బయటపెట్టుకోలేక వారు కిందామీదా పడుతున్నట్లు చెబుతున్నారు.