Begin typing your search above and press return to search.

తెలంగాణ మండ‌లి చైర్మ‌న్ ఇంట్లో ఆరుగురికి పాజిటివ్‌!

By:  Tupaki Desk   |   26 July 2020 5:30 PM GMT
తెలంగాణ మండ‌లి చైర్మ‌న్ ఇంట్లో ఆరుగురికి పాజిటివ్‌!
X
మ‌హ‌మ్మారి వైర‌స్ తెలంగాణ‌లో తీవ్ర రూపంలోనే ఉంది. సామూహిక వ్యాప్తి మొద‌ల‌వ‌డంతో భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వైర‌స్ ప్ర‌ముఖులను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. తాజాగా తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి నివాసంలో పంజా విసిరింది. ఏకంగా ఆరు మందికి పాజిటివ్ తేలింది. ఈ వార్త తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. హోంమంత్రి.. న‌లుగురు ఎమ్మెల్యేలు ఇత‌రులు వైర‌స్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా వారి జాబితాలో గుత్తా చేరారు. కాక‌పోతే ఆయ‌న‌కు వైర‌స్ వ్యాపించ‌లేదు.

దీనిపై తాజాగా ఆదివారం గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి న‌‌ల్లగొండ‌లోని త‌న నివాసంలో మాట్లాడారు. వైద్యుల సలహాలు, మనోధైర్యంతో వైర‌స్ ను పూర్తిగా జయించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైర‌స్ తో సహజీవనం తప్పదని స్ప‌ష్టం చేశారు. తమ ఇంట్లో ఇప్పటికే ఆరుగురు వైర‌స్ బారిన పడ్డారని, కేవలం మనో ధైర్యంతోనే వారు వైరస్‌ను జయించారని వివ‌రించారు. మొదట తన కుమారుడు, కోడలికి పాజిటివ్ రాగా తర్వాత 15 రోజుల్లో మళ్లీ నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు.

హైదరాబాద్‌ లోని ఉస్మానియా ఆస్పత్రిని సీఎం కేసీఆర్ కొత్తది నిర్మించాలని ముందుకు రాగా గ‌తంలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తుచేశారు. ఇప్పుడు వారు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం చూస్తుంటే రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం విద్య, వైద్యంపైనే అధిక నిధులు ఖర్చు చేస్తోందని తె‌లిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం సకల సౌకర్యాలతో సచివాలయం చాలా అవసరమని పేర్కొన్నారు. ఇది గ్ర‌హించి కోర్టులలో కేసు‌లు వేసిన వారు ఉప సంహ‌రించ‌ర‌కుని కొత్త‌ నిర్మాణానికి సహకరించాలని కోరారు.