Begin typing your search above and press return to search.

డేరాబాబా షో బిల్డ‌ప్ ఎంత‌లా ఉంటుందంటే..

By:  Tupaki Desk   |   10 Sep 2017 5:27 AM GMT
డేరాబాబా షో బిల్డ‌ప్ ఎంత‌లా ఉంటుందంటే..
X
ల‌క్ష‌లాది మందికి అరాధ్య‌దైవంగా నిలిచిన డేరా బాబా అలియాస్ గుర్మీత్ లోని కామ‌పిశాచి బ‌య‌ట‌కు రావ‌టం.. కోర్టు అత‌నికి జైలుశిక్ష విధించ‌టం తెలిసిందే. ఇద్ద‌రు సాధ్వీలను అత్యాచారం కేసులో శిక్ష అనుభ‌విస్తున్న అత‌గాడు వేసిన యేషాలు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

బాబాగా చెప్పుకుంటూనే.. షోకిల్లా మాదిరి వ్య‌వ‌హ‌రించే అత‌గాడి తీరు ఒక ఎత్తు అయితే.. దేశంలో మ‌రే బాబాకు లేని విల‌క్ష‌ణ‌మైన కొన్ని చేష్ట‌ల‌లు అత‌గాడి సొంతంగా చెప్పాలి. త‌న‌ను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే బాబా వ‌రుసపెట్టి సినిమాలు తీయ‌టం తెలిసిందే.

సినిమాల కోసం త‌న డేరా ఆశ్ర‌మంలో ఫిలింసిటీ నిర్మించుకున్న అత‌గాడు.. బాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల స‌ర‌స‌న త‌న పేరు ఉండేలా చేసేందుకు భారీ ప్ర‌య‌త్న‌మే చేసిన‌ట్లుగా తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలీవుడ్ ప్ర‌ముఖుల ట్యాగ్ కోసం బాలీవుడ్ స్టార్లు నివ‌సించే ప్రాంతంలో అపార్ట్ మెంట్‌ ను అద్దెకు తీసుకున్న వైనం వెల్ల‌డైంది.

ముంబ‌యిలోని బంద్రాలో ట‌ర్న‌ర్ రోడ్డు జంక్ష‌న్ వ‌ద్ద ఉన్న ప్లాటినం బిల్డింగ్‌ లో మూడో ఫ్లోర్‌ ను అద్దెకు తీసుకున్నాడు డేరాబాబా. ఈ ప్రాంతంలో బాలీవుడ్ ప్ర‌ముఖులైన షారుక్ ఖాన్‌.. స‌ల్మాన్ ఖాన్‌.. సైఫ్ ఆలీకాన్.. సంజ‌య్ ద‌త్‌.. లెజెండ్ యాక్ట‌ర్ దిలీప్ కుమార్‌.. త‌దిత‌రుల ఇళ్లు ఉన్నాయి.

అంతేకాదు.. క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ నివాసం కూడా ద‌గ్గ‌ర్లోనే ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ప్లాటినం బిల్డింగ్ లోని 202.. 1102.. 1202నంబ‌ర్ల ఫ్లాట్ల‌ను బాబా అద్దెకు తీసుకున్న‌ట్లుగా ముంబ‌యి స్థానిక మీడియా చెబుతోంది. అప్పుడ‌ప్పుడు బాబా ఆ అపార్ట్ మెంట్ వ‌ద్ద‌కు వ‌చ్చేవాడ‌ని చెబుతున్నారు.