Begin typing your search above and press return to search.

పిచ్చోడిక‌న్నా ఘోరంగా డేరా బాబా!

By:  Tupaki Desk   |   16 Sep 2017 12:20 PM GMT
పిచ్చోడిక‌న్నా ఘోరంగా డేరా బాబా!
X
అవును! హ‌రియాణాలోని డేరా స‌చ్ఛా సౌదా వ్య‌వ‌స్థాప‌కుడు - ఒక‌ప్పుడు బంగారు ప‌ళ్లెంలో త‌ప్ప అన్నం - బంగారు గ్లాసులో త‌ప్ప నీళ్లు తాగ‌ని రాం ర‌హీం.. ఉర‌ఫ్ డేరా బాబా - అలియాస్ గుర్మీత్ సింగ్ ప‌రిస్థితి అచ్చం అలాగే ఉంద‌ట‌! కాలం బాగున్న‌ప్పుడు అంతా నాదేన‌ని, నేనేం చేసినా.. అడిగేదెవ‌ర‌ని విర్ర‌వీగిన ఫ‌లితంగా ఇప్పుడు డేరా బాబా.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభ‌విస్తున్నాడు. అయితే, విలాసాల‌కు - విందుల‌కు - పొందుల‌కు విచ్చ‌ల‌విడిగా అల‌వాటు ప‌డిన ఆయ‌న దేహం ఇప్పుడు క‌ట‌క‌టాల‌కు - బూట్ల శ‌బ్దాల‌కు - లాఠీ విన్యాసాల చ‌ప్పుళ్ల‌కు త‌ట్టుకోలేక పోతోంద‌ట‌.

దీంతో సీబీఐ కోర్టు శిక్ష విధించిన నాటి నుంచి అంటే గ‌డిచిన 20 రోజులుగా రోహతక్‌ లోని సునేరియా జైల్లో ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. భోగ విలాసాలకు దూరమవడంతో నిద్ర పట్టక జైలు గదిలో ఒంటరిగా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడ‌ని జైలు అధికారులు తెలిపారు. గుర్మీత్‌ పై దాఖలైన రెండు హత్య కేసుల్లో శనివారం చండీగ‌ఢ్‌ సమీపంలోని పంచకుల కోర్టులో విచారణ జరిగినప్పటికీ భద్రతా కారణాల రీత్య ఆయన్ని కోర్టుకు తీసుకెళ్లలేదు. జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన వాదనను వినిపించుకునేందుకు అవకాశం కల్పించారు.

ఇక‌, గుర్మీత్ విలాసాల గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువే అవుతుంది. ఎప్పుడూ 40 మోటారు వాహనాల వరుస ముందుగా కదులుతుంటే, తన వెనకాల వందలాది మంది శిష్యబృందం కదిలివస్తుండగా, రాజసం ఉట్టిపడే విధంగా స్వయంగా కారును నడుపుకుంటూ వెళ్లే గుర్మీత్‌ సింగ్‌ కు స‌న్యాసాశ్ర‌మంలో సాటి మ‌రెవ‌రూ లేర‌ని ఆయ‌న శిష్యులే చెబుతారు. అలా బ‌తికిన బాబాకు ఎంత గతి పట్టిందని తోటి ఖైదీలే వాపోతున్నార‌ట‌. ఎవ‌రూ త‌న‌తో మాట్లాడ‌క‌పోవ‌డంతో పొద్దస్తమానం గదిలో తనలో తాను గొనుక్కుంటూ కాలం వెళ్ల‌దీస్తున్నాడ‌ట బాబా. మొత్తానికి ఎంత నేర్చినా.. ఎంత వార‌లైనా.. కాంత దాసులైతే.. ఫ‌లితం ఎలా ఉంటుందో గుర్మీత్ ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని విశ్లేష‌కులు చెబుతున్నారు.