Begin typing your search above and press return to search.

దుర్మార్గ గుర్మీత్ జైల్లో అలా ఉన్నార‌ట‌

By:  Tupaki Desk   |   1 Sep 2017 11:38 AM GMT
దుర్మార్గ గుర్మీత్ జైల్లో అలా ఉన్నార‌ట‌
X
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన డేరా బాబా అలియాస్ డేరా స‌చ్ఛా సౌదా గురువు గుర్మీతం రాం ర‌హీమ్ సింగ్ వ్య‌వ‌హారానికి సంబంధించి ఆస‌క్తిక‌ర అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి. త‌న ఆశ్ర‌మంలోని ఇద్ద‌రు సాధ్వీలను లైంగిక అత్యాచారానికి పాల్ప‌డిన నేరం నిరూపిత‌మై.. దోషిగా తేల్చి 20 ఏళ్లు జైలుశిక్ష విధించ‌టం తెలిసిందే.

సీబీఐ ప్ర‌త్యేక కోర్టు చెప్పిన ఈ తీర్పు నేప‌థ్యంలో డేరా బాబా అభిమానులుగా చెప్పుకునే గ‌ణం సృష్టించిన ఆరాచ‌కం ఎంత‌న్న‌ది తెలిసిందే. వీరి తీరుపై దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తమైంది. గుర్మీత్ ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువ‌డిన అనంత‌రం జ‌రిగిన రచ్చ ఒక ఎత్తు అయితే.. తీర్పు అనంత‌రం అదుపులోకి తీసుకున్న ఆయ‌న‌కు అధికారులు క‌ల్పించిన వ‌స‌తుల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

తాజాగా జైల్లో ఉన్న ఆయ‌న ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వ‌స‌తులు ఎలాంటివి అందించారు? జైల్లోని మిగిలిన ఖైదీల రియాక్ష‌న్ ఎలా ఉంది? లాంటి ప్ర‌శ్న‌ల‌కు తాజాగా స‌మాధానం దొరికింది. తాజాగా గుర్మీత్ ఉన్న జైలు నుంచే విడుద‌లైన ద‌ళిత నాయ‌కుడు స్వ‌దేశ్ కిరాద్‌.. డేరా బాబా జైలు జీవితం గురించి చెప్పుకొచ్చారు.

జైలుకు వ‌చ్చిన రోజు ఎలాంటి ఆహారం తీసుకోలేద‌ని.. రాత్రంగా ఏడుస్తూనే ఉన్నార‌న్నారు. దేవుడా.. నేనేం త‌ప్పు చేశాను? నేను చేసిన నేరం ఏమిటి? అంటూ త‌న‌లో తాను మాట్లాడుకుంటున్నార‌న్నారు. దోషిగా తేలిన ఆగ‌స్టు 25 రాత్రి ఏమీ తిన‌లేద‌న్నారు. అత‌నికి ఎలాంటి ప్ర‌త్యేక సౌక‌ర్యాలు జైల్లో క‌ల్పించ‌లేద‌ని. .సాధార‌ణ ఖైదీలానే ప‌రిగ‌ణిస్తున్న‌ట్లుగా చెప్పారు.

గుర్మీత్ ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు త‌ర్వాత ఆయ‌న పేరుతో హ‌ర్యానా.. పంజాబ్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న హింస‌పై జైల్లోని ఇత‌ర ఖైదీలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు చెబుతున్నారు. జైల్లో ఆయ‌న‌పై దాడి జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.