Begin typing your search above and press return to search.

ఎందుకంటే?: డేరా బాబాకు 20 ఏళ్లు జైలు

By:  Tupaki Desk   |   29 Aug 2017 3:36 AM GMT
ఎందుకంటే?:  డేరా బాబాకు 20 ఏళ్లు జైలు
X
త‌న‌ను తాను దేవుడిగా చెప్పుకునే డేరా బాబా పాపం పండింది. అమాయ‌కంగా న‌మ్మి.. ఆరాధించిన భ‌క్తురాళ్ల‌పై అత్యాచారానికి పాల్ప‌డిన గుర్మీత్ రాం ర‌హీమ్ సింగ్‌కు జైలుశిక్ష విధించిన వైనం కొంత క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొని ఉంది. మెసెంజ‌ర్ ఆఫ్ గాడ్ అంటూ త‌న గురించి తాను చెప్పుకున్న గుర్మీత్‌కు సీబీఐ కోర్టు 20 ఏళ్లు జైలుశిక్ష విధించింది. వాస్త‌వానికి ఈ శిక్ష 22 ఏళ్లుగా చెప్పాలి. కానీ.. ఏక‌కాలంలోనే శిక్ష‌ను అనుభ‌వించాల్సి రావటంతో 20 ఏళ్లు జైలుగా మారింది.

రోహ్ త‌క్ న‌గ‌ర శివారుల్లోని సునారియాలోని జైలులో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కోర్టులో ప‌రిమిత స‌భ్యుల న‌డుమ గుర్మీత్ కేసును సీబీఐ కోర్టు విచారించింది. జ‌డ్జి.. గుర్మీత్‌.. కేసును వాదించిన‌ ఇరువ‌ర్గాల లాయ‌ర్ల న‌డుమ తుది విచార‌ణ జ‌రిగింది. మొత్తం అర‌గంట పాటు సాగిన విచార‌ణ అనంత‌రం సీబీఐ న్యాయ‌మూర్తి త‌న తొమ్మిది పేజీల తీర్పును చ‌దివి వినిపించారు.

అత్యంత తీవ్ర‌మైన నేరానికి గుర్మీత్ పాల్ప‌డ్డాడ‌ని.. ఎలాంటి ద‌యాదాక్షిణ్యాల‌కు అత‌ను అర్హుడు కాడ‌ని కోర్టు తేల్చి చెప్పింది. త‌న‌ను న‌మ్మిన భ‌క్తురాళ్ల‌పై లైంగిక దాడికి పాల్ప‌డ‌టం ద్వారా అత్యంత తీవ్ర‌మైన నేరానికి గుర్మీత్ పాల్ప‌డ్డాడ‌ని.. ఆయ‌న‌పై ఆరోపించిన రెండు అత్యాచార ఉదంతాల్ని కోర్టు విశ్వ‌సిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఒక్కో అత్యాచార ఉదంతానికి ప‌దేళ్లు చొప్పున‌.. రెండు అత్యాచార ఉదంతాల‌కు మొత్తంగా 20 ఏళ్లు జైలుశిక్ష విధించిన‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే.. గుర్మీత్ జైలుకు సంబంధించి కొంత క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. ఆయ‌న‌కు ప‌దేళ్లు జైలుశిక్ష మాత్ర‌మేనంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. రెండు అత్యాచార కేసుల్లో వేర్వేరుగా ప‌దేళ్లు జైలుశిక్ష విధించ‌టంతో కొంత క‌న్ఫ్యూజన్ నెల‌కొని పదేళ్లు జైలుశిక్ష అన్న ప్ర‌చారం జ‌రిగింది. యాభై ఏళ్ల గుర్మీత్‌కు రెండు అత్యాచార కేసుల్లో క‌లిపి 20 ఏళ్లు.. బెదింపుల‌కు పాల్ప‌డిన కేసులో రెండేళ్ల జైలుశిక్ష‌.. ఒక్కో అత్యాచార కేసులోనూ రూ.15లక్ష‌ల జ‌రిమానాను విధించారు. మ‌రో మూడు అభియోగాలకు సంబంధించి రూ.65వేల జ‌రిమానాను విధించారు.

ఈ జరిమానాలో రూ.14 ల‌క్ష‌ల చొప్పున ఒక్కో అత్యాచార బాధితురాలికి అందించాల‌ని కోర్టు పేర్కొంది. బెదిరింపు కేసులో విధించిన రెండేళ్ల జైలుశిక్ష‌ను అత్యాచార కేసుల్లో విధించిన జైలుశిక్ష‌తో పాటే అమ‌లు చేయాల‌ని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు అనంత‌రం తాము హైకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లుగా గుర్మీత్ త‌ర‌పు లాయ‌ర్లు పేర్కొనటం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. త‌న‌కు శిక్ష విధించొచ్చ‌ద్ద‌ని.. తాను చేసిన సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్ని దృష్టిలో పెట్టుకొని శిక్ష‌ను త‌గ్గించాలంటూ త‌న త‌ర‌ఫు లాయ‌ర్ చేత కోర్టును అభ్య‌ర్థించారు గుర్మీత్‌. త‌న వ‌య‌సు.. త‌న‌కున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కోరారు. అయితే.. కోర్టు ఈ అభ్య‌ర్థ‌న‌ను నిరాక‌రించింది. గ‌డిచిన ఎనిమిదేళ్లుగా గుర్మీత్‌కు హైబీపీ.. తీవ్ర‌మైన మ‌ధుమేహం.. న‌డుం నొప్పి లాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లుగా ఆయ‌న త‌ర‌ఫు లాయ‌ర్లు కోర్టుకు చెప్పారు. దైవ‌దూత‌కు ఇన్నేసి ఆరోగ్య స‌మ‌స్య‌లేందో?