Begin typing your search above and press return to search.

రచ్చ చేస్తున్న ఏపీ బీజేపీ నేతలకు గుంటూరు పోలీసుల పంచ్

By:  Tupaki Desk   |   3 March 2021 11:00 AM IST
రచ్చ చేస్తున్న ఏపీ బీజేపీ నేతలకు గుంటూరు పోలీసుల పంచ్
X
ఇదిగో తోక అంటే అదిగో పులి అనే పరిస్థితి. సోషల్ మీడియా చెలరేగిపోతున్న వేళ.. ఎవరికి తోచినట్లుగా వారు విషయాల్ని ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. బ్యాడ్ లక్ ఏమంటే.. సున్నితమైన అంశాల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీలు సైతం.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. ఏపీ బీజేపీ నేతల తీరు ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.

గుంటూరు జిల్లాలోని సీతాదేవి పాదముద్రలు.. నరసింహస్వామి విగ్రహం ఉన్న ఒక గుట్టపై క్రైస్తవ నిర్మాణం జరుపుతుందంటూ చేస్తున్న ప్రచారానికి సంబంధించిన నిజాల్ని తాజాగా గుంటూరు పోలీసులు వెల్లడించటమే కాదు.. అధికారిక ట్విటర్ ఖాతాలో క్లారిటీ ఇవ్వటంతో ఏపీ బీజేపీ నేతలకు భారీ షాక్ గా మారింది. అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతాదేవి పాదముద్రలు.. నరసింహస్వామి విగ్రహం ఉన్న ఒక గుట్టను ఒక క్రైస్తవ మిషనరీ అక్రమించినట్లుగా ఏపీ బీజేపీ ప్రకటించటం సంచలనంగా మారింది. తీవ్రమైన భావోద్వేగానికి గురి చేసే ఈ అంశంలోని వాస్తవాల లెక్కను తాజాగా గుంటూరుజిల్లా పోలీసులు క్లియర్ గా చెప్పేశారు. సీతాదేవి పాదముద్రలు ఉన్న కొండకు.. క్త్రైస్తవ నిర్మాణం జరుగుతున్న కొండకు ఎలాంటి సంబంధం లేదని.. ఇవి రెండు వేర్వేరు అన్న విషయాన్ని స్పష్టం చేశారు.

ఏదో మాట వరసకు అన్నట్లు కాకుండా.. గుంటూరు రూరల్ పోలీసులు ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. అంతేకాదు.. ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ప్రేమ.. శాంతి.. ఐకమత్యం చాటేలా ఉపయోగించుకోవాలంటూ తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో ఇన్ ఛార్జి సునీల్ దియోధర్ కు పంచ్ వేశారు. ఏదో మాట వరసకుకాకుండా.. దానికి సంబంధించిన ఫోటోల్ని ట్విటర్లో పంచుకున్నారు. వీడియోను పోస్టు చేశారు. ఎడ్లపాడులో భారీగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నట్లుగా సోము వీర్రాజు ఆరోపించటంతోపాటు.. జగన్ సర్కారుపై అనవసరమైన విమర్శలు చేశారు. గుంటూరు రూరల్ పోలీసులు ఎంట్రీతో ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న విషయం స్పష్టమైంది.