Begin typing your search above and press return to search.

రోడ్డు ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న గ‌ల్లా జ‌య‌దేవ్‌

By:  Tupaki Desk   |   29 April 2016 7:27 AM GMT
రోడ్డు ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న గ‌ల్లా జ‌య‌దేవ్‌
X
తెలుగు రాష్ర్టాల్లో గ‌త నాలుగు రోజులుగా రోడ్డు ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయి. ఎండ‌ల తీవ్ర‌త అధికంగా ఉండ‌డంతో డ్రైవ‌ర్లు ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా రెప్పాటులో ప్ర‌మాదం జ‌రిగిపోతోంది. తాజాగా ఈ రోజు విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో గుంటూరు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఎలాంటి గాయాలు కాకుండా తృటిలో బ‌య‌ట‌ప‌డ్డారు. జ‌య‌దేవ్ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైన వెంట‌నే కారులో ఉన్న ఎయిర్‌ బెలూన్స్ తెర‌చుకోవ‌డంతో ఆయ‌న ఈ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు.

జ‌య‌దేవ్ ఈ రోజు ఉద‌యం గ‌న్న‌వ‌రం నుంచి గుంటూరు వెళుతుండ‌గా విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుపత్రి వ‌ద్ద‌కు వ‌చ్చేసరికి ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు ప‌క్క‌నే ఉన్న ఇసుక గుట్ట‌ను ఢీకొట్టింది. వెంట‌నే జ‌య‌దేవ్ కారును వెన‌క నుంచి స్పీడ్‌ గా వ‌చ్చిన మ‌రో కారు ఢీ కొట్ట‌డంతో జ‌య‌దేవ్ కారు ఒక్క‌సారిగా ముందుకు వెళ్లింది. కారులో ఎయిర్‌ బెలూన్స్ తెర‌చుకోవ‌డంతో జ‌య‌దేవ్‌ కు ఎలాంటి గాయాలు కాలేదు. జ‌య‌దేవ్‌ కు ప్రమాదం జ‌రిగింద‌న్న విష‌యం తెలుసుకున్న వెంట‌నే ప‌లువురు టీడీపీ నాయ‌కులు - ప్ర‌జాప్ర‌తినిధులు ఆయ‌న‌కు ఫోన్ చేసి ప్ర‌మాదంపై ఆరా తీశారు.

జ‌య‌దేవ్ ఎంపీగా ఎన్నిక‌య్యాక ఆయ‌న వాహ‌నాలు యాక్సిడెంట్‌ కు గుర‌వ్వ‌డం ఇది మూడోసారి. గ‌తంలో ఆయ‌న హైద‌రాబాద్‌ లో బైక్ న‌డుపుతూ కింద‌ప‌డడడంతో ఆయ‌న కాలుకు స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ఆయ‌న కాన్వాయ్‌ లో వాహ‌నాలు వ‌రుస‌గా ఢీకొన‌డంతో ఐదు వాహ‌నాలు దెబ్బ‌తిన్నా అప్పుడు కూడా జ‌య‌దేవ్ ఎలాంటి గాయాలు లేకుండా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇక తాజా ప్ర‌మాదం నుంచి ఆయ‌న మ‌రోసారి సుర‌క్షితంగా త‌ప్పించుకున్నారు.