Begin typing your search above and press return to search.

అమెరికాలో తుపాకీ తూటాలను ఆపేవారే లేరా?

By:  Tupaki Desk   |   24 Nov 2022 3:30 AM GMT
అమెరికాలో తుపాకీ తూటాలను ఆపేవారే లేరా?
X
తుపాకీ తూటాలకు అమెరికా ప్రజానీకం బలి అవుతోంది. అమాయకులు చనిపోతున్నారు. ఎవడికి ఎక్కడ తిక్కరేగినా పాపం ముందున్న వారిపై కాల్చేస్తున్నారు. ఏ పాపం చేయని స్కూలు విద్యార్థులు, రోడ్లపై వెళ్లే జనాలు ఇలా ఎందరో అమెరికా తుపాకీ సంస్కృతికి బలి అయిపోతున్నారు. ఓ వ్యక్తి గన్ పట్టుకొని ఎదుటి వాళ్లను షూట్ చేసుకుంటూ పోవడం.. మనం సినిమాల్లోనే చూస్తాం.. కానీ ఇప్పుడు అమెరికాలో ఎక్కడ క్రైమ్ జరిగినా ఇది రియల్ గా కనిపిస్తోంది.

అగ్రరాజ్యం అమెరికా రోజురోజుకు గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా మరోసారి కాల్పులతో అమెరికా దద్దరిల్లింది. వర్జీనియాలోని ప్రముఖ వాల్ మార్ట్ స్టోర్ లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నిందితుడు అదే స్టోర్ లో పనిచేస్తున్న మేనేజర్ గా తెలుస్తోంది. రాత్రి స్టోర్ మేనేజర్ బ్రేక్ రూంలోకి చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వచ్చేసరికి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

నిత్యం పాకెట్లో గన్ పెట్టుకున్న వారు చిన్న చిన్న కారణాలకే దానికి పని చెబుతున్నారు. అప్పట్లో ఓ స్కూల్ లోని 19 మంది చిన్నారులతో పాటు 21 మందిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఇలాంటివి ఏడాదిలోపు 27 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోని మిగతా దేశాల కంటే అమెరికాలోనే ఎక్కువగా గన్స్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

అమెరికన్ సమాజంలో అసహనం నెలకొంది. అందుకే చాలా మంది విచక్షణ కోల్పోయి కాల్పులకు తెగబడుతున్నారు. ప్రస్తుతానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. అయితే ఈ ముప్పు మరింత దగ్గరవుతున్నట్లు తాజా ఘటనలు తెలియజేస్తున్నాయి.

50 ఏళ్ల కిందట అమెరికాలో 9 కోట్ల తుపాకులు ఉన్నట్లు సమాచారం. 2011 లెక్కల ప్రకారం.. 88 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎక్కువశాతం మరణాలు గన్ కాల్చడం వల్లే చనిపోయారని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఈ గన్ కల్చర్ ను అమెరికా ఎందుకు ఆపలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా దీనిని కొనసాగించడానికి కొందరు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.


2018లో ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల తుపాకులు ఉన్నాయని స్విట్జర్లాండ్లోని స్మాల్ అర్మ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిపింది. ఇందులో అమెరికాలోనే ప్రతి వందమంది పౌరుల్లో 120 తుపాకులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. అంటే ఇతర దేశాల్లో కంటే అమెరికాలోనే ఎక్కువ మంది గన్స్ కలిగి ఉన్నారు. అయితే ఈ రెండేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) కారణమని తెలుస్తోంది.

వీరు పెద్ద ఎత్తున డబ్బును కలిగి ఉన్నారని, రాజకీయ అండదండలతో వీరు గన్ మార్కెట్ ను విస్తృతం చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంత తీవ్రంగా ఉన్నా అమెరికా ప్రభుత్వం తుపాకీ నియంత్రణ బిల్లు పేరుతో తూతూ మంత్రంగా చట్టాలు చేస్తోంది. ఈ గన్ కల్చర్ కు తెరపడక ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నారు. ఈ రుధిర ధార ఆగేదెప్పుడోనని అమెరికన్లు అంతా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.