Begin typing your search above and press return to search.

అమెరికన్లలో ఇప్పటికి చురుకు పుట్టిందా ?

By:  Tupaki Desk   |   12 Jun 2022 7:13 AM GMT
అమెరికన్లలో ఇప్పటికి చురుకు పుట్టిందా ?
X
ప్రపంచ దేశాల్లో అత్యధికంగా గన్ కల్చర్ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది అగ్రరాజ్యం అమెరికా మాత్రమే. ప్రజాస్వామ్యం గురించి, శాంతి, స్వేచ్ఛ గురించి ప్రపంచదేశాలకు చెప్పే నీతులేవీ అమెరికా ఆచరించదు. దీని ఫలితంగానే అమెరికాలో గన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోయింది. అమెరికా జనాభా సుమారు 30 కోట్లయితే ఆ దేశంలో తుపాకీల సంఖ్య సుమారు 50 కోట్లంటే నమ్మటం కష్టమే.

గడచిన రెండు మాసాల్లో అమెరికాలోని అనేక నగరాల్లో కొందరు యువకులు తుపాకులతో మారణహోమాలు సృష్టించిన విషయం సంచలనంగా మారింది. కనీసం ఐదు పాఠశాలల్లోని విద్యార్ధులే టార్గెట్లుగా కొందరు ఉన్మాదులు స్కూళ్ళపై దాడులుచేసి జరిపిన కాల్పుల్లో కనీసం 150 మంది పిల్లలు చనిపోయారు. ఇక బార్లు, పబ్బులు, షాపింగ్ మాల్స్ ల్లో తుపాకీ కాల్పుల సంఖ్యకు, చనిపోయిన వారికి లెక్కేలేదు. దీంతో జనాల్లో ఒక్కసారిగా చురుకు పుట్టినట్లుంది.

అందుకనే వాషింగ్టన్ డీసీలోని స్మారక మైదానం నేషనల్ మాల్ ముందు ప్రజలు భారీ ప్రదర్శన చేశారు. సుమారు 50 వేలమంది ‘మార్చ్ ఫర్ అవర్స్ లైవ్స్’ అనే పేరుతో జరిపిన ప్రదర్శనలో పాల్గొన్నారు. పార్లమెంటులోని సెనేటర్లందరు గన్ కల్చర్ కు ఫులిస్టాప్ పెట్టాలంటు నినాదాలిచ్చారు. తుపాకీ నియంత్రణపై పార్లమెంటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన చిన్నారులను వెనక్కు తీసుకు రాలేకపోయినా కనీసం గన్ కల్చర్ ను అయినా కంట్రోల్ చేయగలరు కదా సెనేటర్లంటు నినాదాలు చేశారు.

21 ఏళ్లలోపు వారికి ఎట్టి పరిస్ధితుల్లోను తుపాకులు అమ్మేందుకు లేదనే చట్టాన్ని వెంటనే తీసుకు రావాలంటు ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు. నిజానికి అమెరికాలో తుపాకీ లైసెన్సుకు అప్లై చేస్తే చాలు వెంటనే ఇచ్చేస్తారు. ఒక్కో లైసెన్స్ మీద మూడు తుపాకీలు కొనుకోవచ్చు. అవసరం ఉన్నా లేకపోయినా పిల్లలు కూడా తుపాకీలు కొనేస్తున్నారు. స్కూళ్ళకు వెళ్ళే పిల్లల్లో కొందరు లంచ్ బాక్సులు పెట్టుకున్నట్లు బ్యాగుల్లో తుపాకీలు పెట్టుకుంటున్నారు. ఆయుధాల అమ్ముతున్న 10 కంపెనీల ఏడాది టర్నోవర్ రు. 80 వేల కోట్లు. దీంతోనే ఆయుధాలు ఏ స్ధాయిలో అమ్ముడు పోతున్నాయో, వాటి టర్నోవర్ ఎంత వేగంగా పెరిగిపోతోందో అర్ధమైపోతోంది.