Begin typing your search above and press return to search.

ఎఫ్ బీఐకి దొరక్కుండా ముప్ప తిప్పలు పెట్టేస్తున్న గుజరాతీ

By:  Tupaki Desk   |   20 Oct 2019 10:39 AM IST
ఎఫ్ బీఐకి దొరక్కుండా ముప్ప తిప్పలు పెట్టేస్తున్న గుజరాతీ
X
ప్రపంచంలో అత్యుత్తమ దర్యాప్తు సంస్థల్లో ఒకటిగా చెప్పే ఎఫ్ బీఐకే ఒక పట్టాన కొరుకుడుపడని సామాన్యుడు తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక హత్య కేసులో నిందితుడైన అతగాడి కోసం ఎఫ్ బీఐ సొంతంగా రంగంలోకి దిగి అమెరికాతో సహా భారత్ లోని పలు ప్రాంతాల్లో జల్లెడ పట్టినా అతగాడి ఆచూకీ లభించని విచిత్రమైన పరిస్థితి తాజాగా నెలకొంది.

అంతేకాదు.. ఎఫ్ బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో.. టాప్ టెన్ స్థానాల్లో ఒకడిగా ఉన్న ఈ గుజరాతీ మీద ఏకంగా రూ.70లక్షల రికార్డు ఉందట. ఎలాంటి కేసునైనా ఇట్టే దర్యాప్తు చేయటమే కాదు.. నేరస్తుల్ని ఇట్టే అదుపులోకి తీసుకునే ఎఫ్ బీఐకే ఈ గుజరాతీ ఒక పట్టాన కొరుకుడుపడటం లేదంటున్నారు.

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ అనే 24 ఏళ్ల వ్యక్తి అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్స్ లో పని చేసేవాడు. అతడు తన భార్యను అతి కిరాతకంగా చంపేసిన కేసులో ప్రధాన నిందితుడు. 2015లో జరిగిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఆ ఏడాది ఏప్రిల్ 12 రాత్రి తన భార్య 21 ఏళ్ల పలక్ తో స్టోర్ లోని కిచెన్ లోకి వెళ్లాడు. కాసేపటికి ఒక్కడే బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొద్ది గంటల తర్వాత పలక్ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.

చాలాసార్లు కత్తితో పొడిచిన కారణంగా ఆమె మరణించినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫలక్ భర్త భద్రేశ్ కుమార్. సీసీ కెమేరాల పుటేజ్ ప్రకారం భార్యను హత్య చేసిన తర్వాత ఒక టాక్సీలో హోటల్ కు వెళ్లిన అతడు.. అక్కడే ఉండిపోయాడు. తర్వాతి రోజు తెల్లవారుజామున పరారయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతను కనిపించలేదు.

అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు అమెరికాతో సహా.. భారత్ లోనూ జల్లెడ పట్టారు. అయినా ప్రయోజనం శూన్యం. అతనని పట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు. దీంతో అతడ్ని పట్టించిన వారికి రూ.70లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకూ భద్రేశ్ ఆచూకీ మాత్రం అభించకపోవటాన్ని ఎఫ్ బీఐ జీర్ణించుకోలేకపోతోంది.