Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు అమ్మకం వెనుక గుజరాతీల కుట్ర?

By:  Tupaki Desk   |   25 Aug 2021 12:30 AM GMT
విశాఖ ఉక్కు అమ్మకం వెనుక గుజరాతీల కుట్ర?
X
ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం బేరం పెట్టిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కును అమ్మవద్దంటూ పెద్ద ఎత్తున ఆంధ్రులు ఉద్యమం చేస్తున్నప్పటికీ తమ వైఖరి మారదని కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది. విశాఖ ఉక్కును ఏపీ ప్రభుత్వానికి అమ్మాలంటూ ఏపీ సీఎం జగన్ చేసిన విన్నపాన్ని కూడా మోడీ సర్కార్ తోసిపుచ్చింది. కరోనా వల్ల అనివార్యమైన లాక్ డౌన్ లోనూ విశాఖ ఉక్కు ధృఢంగా నిలబడి లాభాలను అర్జించింది.

ఇక, సెకండ్ వేవ్ టైంలో దేశానికి ఆక్సిజన్ అందించి సంజీవనిలా మారిందని చెబుతున్నా కేంద్రం వినడం లేదు. ఈ నేపథ్యంలోనే కామధేనువు వంటి విశాఖ ఉక్కును హస్తగతం చేసుకునేందుకు పలు ప్రైవేటు కంపెనీలు కేంద్రంతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నాయని ప్రచారం జరుగుతోంది. నష్టాల పేరుతో కేంద్రం బేరం పెట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కైవసం చేసుకునేందుకు గుజరాతీ సంస్ధ మిట్టల్ గ్రూప్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

టాటా స్టీల్ కూడా విశాఖ ఉక్కుపై ఆసక్తి చూపుతున్నప్పటికీ...మోడీతో అనుబంధం ఉన్న గుజరాతీ కంపెనీకే కేంద్రం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. మోడీ సొంత ఇలాకాకు చెందిన కంపెనీ కావడంతో గుజరాతీ లాబీ కూడా మిట్టల్ గ్రూప్ నకు సహకారం అందిస్తోందట. నవరత్న సంస్ధల్లో ఒకటైన వైజాగ్ స్టీల్ ను చేజిక్కించుకోవడం వెనుక మిట్టల్ గ్రూప్ ప్లాన్ వేరే ఉందట. విశాఖ కేంద్రంగా భవిష్యత్తులో ఏపీ-ఒడిశా జోన్ ఏర్పాటు చేసి తమ వ్యాపార విస్తరణకు ఆ గ్రూప్ ప్లాన్ చేస్తోందట.

మిట్టల్ గ్రూప్ నకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కట్టబెట్టడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉందట. త్వరలోనే ఈ సంస్థ బిడ్ దాఖలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో లక్ష్మీ మిట్టల్ భేటీకి రెడీ అయ్యారని, వారిద్దరూ చర్చలు జరిపిన తర్వాత ఈ డీల్ పై క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది. నిజంగా విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉంటే మిట్టల్ గ్రూప్ కొంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీలకు వాటిని ధారాదత్తం చేయడమే మోడీ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.