Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ ఫ‌లితం.. టీఆర్ఎస్‌ కి క్లియ‌రెన్స్‌

By:  Tupaki Desk   |   9 Dec 2022 1:30 PM GMT
గుజ‌రాత్ ఫ‌లితం.. టీఆర్ఎస్‌ కి క్లియ‌రెన్స్‌
X
తాజాగా జ‌రిగిన గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్క‌డి అధికార పార్టీ బీజేపీ విజ‌య‌దుందుభి మోగించింది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయింది. అంతేకాదు.. గ‌తానిక‌న్నా ఎక్కువ‌గా బీజేపీ ఇక్క‌డ సీట్లు కొల్ల‌గొట్ట‌డం గ‌మ‌నార్హం. నిజానికి కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ స‌హా దాదాపు చిన్నా చిత‌కా పార్టీలు 60 వ‌ర‌కు గుజ‌రాత్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇది.. బీజేపీకి బాగా లాభించింది. ఫ‌లితంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కొట్టుకుపోయి.. ఏడోసారి పార్టీ అఖండ మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కింది.

వాస్త‌వానికి 1995 నుంచి అధికారంలో ఉన్న నేప‌థ్యంలో బీజేపీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. పైగా.. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీపైక‌స్సుబుస్సుమ‌న్న ప‌టేళ్ల వ‌ర్గం అదే ఆవేద‌న‌తో ఉంది. దీంతో బీజేపీకి వ్య‌తిరేక‌ప‌వ‌నాలు వీస్తాయ‌ని తొలుత భావించారు. ఒక‌వేళ గెలిచినా.. ఏదో బొటా బొటి మార్కులు వేయించుకుని అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని లెక్కులు వేసుకున్నారు. కానీ, అనూహ్య విజ‌యం సాధించింది.

వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. మొత్తం 182 స్థానాలకు 156 స్థానాల్లో గెలుపొంది సరికొత్త చరిత్రను లిఖించింది. 1995లో తొలిసారి 121 స్థానాలు ద‌క్కించుకున్న పార్టీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వెనుదిరిగి చూసుకున్న‌ది లేదు. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంది. 1998లో 117, 2002లో 127 స్థానాలు, 2007లో 117 సీట్లు, 2012లో 115 స్థానాలు, 2017లో 99 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా 156 స్థానాలు ద‌క్కించుకుని అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది.

ఇక, ఇక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకుని తీరుతామ‌ని భావించిన కాంగ్రెస్ 17 స్థానాల‌కే ప‌రిమితం అయింది. మ‌రో పార్టీ ఆప్ 5, ఇతరులు 4 స్థానాలను దక్కించుకున్నారు. ఇలా.. మొత్తానికి బీజేపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం వెనుక‌.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు భారీగా చీలిపోవ‌డ‌మే క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం ప్ర‌తిప‌క్ష పార్టీలే. ఏ పార్టీ కూడా పొత్తులు పెట్టుకోలేదు. వేటిక‌వే ముందుకు సాగాయి.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ఫ‌లితం తెలంగాణ‌లోనూవ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలాగంటే.. తెలంగాణ‌లోఅధికార టీఆర్ ఎస్‌.. ఒంట‌రిగానో.. లేక క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకొనో ముందుకు సాగ‌నుంది. ఇక‌, మిగిలిన రెండు పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం ఒంట‌రిగానే ముందుకు సాగ‌నున్నాయి.

ఎంఐఎం పార్టీ ఉన్నా.. అది టీఆర్ ఎస్ వైపే ఉంటుంది. సో.. ఇక్క‌డ కూడా ఏ పార్టీ పొత్తుపెట్టుకునే ప‌రిస్థితి లేదు. దీంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఉన్న‌ప్ప‌టికీ.. అది చీలిపోయి.. గుజ‌రాత్ మాదిరిగానే ఇక్క‌డ కూడా టీఆర్ ఎస్‌కు మ‌రోసారి అధికారం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.