Begin typing your search above and press return to search.

భర్తతో కలిసి ఉండాలా? లేదా? అన్నది భార్య ఇష్టం.. గుజరాత్ హైకోర్టు సంచలనం

By:  Tupaki Desk   |   31 Dec 2021 4:31 AM GMT
భర్తతో కలిసి ఉండాలా? లేదా? అన్నది భార్య ఇష్టం.. గుజరాత్ హైకోర్టు సంచలనం
X
భార్యభర్తలు కలిసి కాపురం చేయాలని.. కలిసి ఉండాలని అనుకోవాలే కానీ.. ఎవరి బలవంతం మీదనో కాపురం చేయాలని ఆదేశించటం తగదన్న కీలక తీర్పును ఇచ్చింది గుజరాత్ హైకోర్టు. భర్తతో కలిసి ఉండాలనే విషయంలో భార్యకు అంగీకారం ఉన్నట్లే.. నో అని కూడా చెప్పొచ్చని తెలిపింది. అంతేకాదు.. సవతులతో కలిసి జీవించాలని భార్యను బలవంతం చేసే హక్కును భర్తకు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

ముస్లిం చట్ట బహుభార్యత్వాన్ని అనుమతిస్తోంది కానీ ప్రోత్సహించలేదని.. అందువల్ల ఒక వ్యక్తి తొలిభార్య అతనితో కలిసి ఉండేందుకు ఎస్ చెప్పొచ్చు.. నో చెప్పొచ్చని.. అదంతా భార్య ఇష్టమని పేర్కొంది.

భార్యను భర్తతో కలిసి కాపురం చేయాలని కోర్టులు బలవంతం చేయలేవన్న గుజరాత్ కోర్టు.. కింది కుటుంబ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దాంప్యత హక్కులు కేవలం భర్రతకు మాత్రమే సొంతం కాదని జస్టిస్ పార్ధివాలా.. జస్టిస్ నీరల్ మెహతాల బెంచ్ లు సూచన చేశాయి. ఈ కీలక తీర్పునకు కారణమైన కేసు వివరాల్లోకి వెళితే.. 2010లో ఈ కేసు పిటిషనర్ అయిన మహిళకు ఒక వ్యక్తితో పెళ్లైంది.

2015లో వీరికో బాబు పుట్టాడు. నర్సుగా ఆమెను ఆస్ట్రేలియా పంపాలని భర్త కుటుంబం నిర్ణయించింది. దీనికి సదరు మహిళ నో చెప్పింది. బలవంతం చేస్తుండటంతో వారి నిర్ణయాన్ని వ్యతిరేకించి భర్త కుటుంబం నుంచి బయటకు వచ్చేసింది. దీనిపై భర్త కుటుంబం కోర్టును ఆశ్రయించగా.. ఆమెను కాపురానికి వెళ్లాల్సిందిగా ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.

దీనిపై అప్పీలుకు గుజరాత్ హైకోర్టును సదరు మహిళ ఆశ్రయించింది. కేసు పూర్వపరాల్ని పరిశీలించిన హైకోర్టు తాజాగా కీలక తీర్పును వెలువరించింది. కోర్టులు బలవంతంగా కాపురం చేయించటం సరికాదని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.