Begin typing your search above and press return to search.

మోడీ మాష్టారు.. ఆ హైకోర్టు చెప్పిన మాట విన్నారా?

By:  Tupaki Desk   |   7 April 2021 10:30 AM GMT
మోడీ మాష్టారు.. ఆ హైకోర్టు చెప్పిన మాట విన్నారా?
X
హద్దు ఆపు లేకుండా పెరిగిపోతున్న కరోనా కేసుల దెబ్బకు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కిందామీదా పడిపోతున్నాయి. గతంలో మాదిరి ఆంక్షల ఛట్రాన్ని విధించలేరు. గత ఏడాది లాక్ డౌన్ దెబ్బకు ప్రభావితమైన రంగాలు ఇప్పటికి కోలుకున్నది లేదు. అంతేనా.. దేశ ప్రజలు ఆ కష్టాల బారి నుంచి బయటకు రాలేదు. అలాంటి వేళ.. మరోసారి లాక్ డౌన్ అంటే.. ఆర్థికంగా తీవ్ర ప్రభావానికి గురి కాక తప్పదు. అందుకే.. కేసులుపెరుగుతున్నా.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. దేశంలో తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్రంలో కొద్ది రోజులుగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్వల్ప కాల లాక్ డౌన్ గురించి ఆలోచించాలని పేర్కొంది. గుజరాత్ లోని కోవిడ్ కేసుల నేపథ్యంలో సుమోటోగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని లాక్ డౌన్ గురించి ఆలోచించాలని కోరింది.

‘‘కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.. సోమవారం ఒక్కరోజే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన.. అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే.. పరిస్థితి చేజారేలా ఉంది. కనీసం మూడు..నాలుగు రోజులు కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ విధించి పరిస్థితిని సమీక్షిస్తే బాగుంటుంది’’ అని కీలక వ్యాఖ్యలు చేసింది.

రాజకీయ కార్యక్రమాలు.. సభలు.. సమావేశాల్ని నియంత్రించాలని.. ఆఫీసులు.. వాణిజ్య సంస్థల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేయటం వల్ల కూడా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. గుజరాత్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ స్పందించారు. లాక్ డౌన్ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని.. పేద ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. దేశ ప్రధాని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాదంటారా?