Begin typing your search above and press return to search.

కర్ణాటకలోనూ గుజరాత్‌ తరహా ఫలితాలా?

By:  Tupaki Desk   |   28 Dec 2017 6:23 AM GMT
కర్ణాటకలోనూ గుజరాత్‌ తరహా ఫలితాలా?
X
గుజరాత్‌ తరహా ఎన్నికల ఫలితాలు వచ్చే యేడాది జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పునరావృతం అవుతాయా? ఇదే ప్రశ్న కర్ణాటక - జాతీయ - రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశం అయ్యింది. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అధికారంలోకి వచ్చినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఆధిక్యతను నిలుపుకోగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పునరుజ్జీవం సాధించి సత్తా చాటుకుంది. ఇదే విధంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలల్లో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు పట్టణ ప్రాంతంలో - బీజేపీ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్‌ ఆధిక్యతను సాధిస్తాయా? అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటకలోని పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు గత రెండు దశాబ్దాలుగా ఏ పార్టీ వైపు స్థిరంగా ఉండటం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం పట్టణాల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్‌ గట్టి పోటీని ఎదుర్కొంటూ పాగా వేసే పరిస్థితి కనిపిస్తోందని ముందస్తుగానే అంచనా వేస్తున్నారు. ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున అప్పటి రాజకీయ పరిస్థితులు ఎన్నికల్లోని అంశాల ఆధారంగా ఓటర్లు తమ ఓటు వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో కూడా గుజరాత్‌ తరహాలోనే పట్టణ - గ్రామీణ ఓటర్ల వ్యత్యాసం ఖచ్చితంగా కనిపిస్తుందని భావిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో సాధ్యమా? కాదా అనేది ఎన్నికల ఫలితాలను బట్టే నిర్ధారణ అవుతుంది. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు గత ఎన్నికల్లో ఓటింగ్‌ సరళి పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ - పట్టణ ప్రాంతాల్లో బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యత చలాయిస్తాయని విశ్లేషిస్తున్నారు.

ఇటీవల జరిగిన గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో మోదీ, అమిత్‌షాలతోపాటు బీజేపీ జాతీయ స్థాయి యంత్రాంగం మొత్తం కేంద్రీకరించి పనిచేసినా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లను మాత్రమే స్వల్ప ఆధిక్యతతో సాధించుకోగలిగింది. ఆ రాష్ట్రంలో కుల, వర్గపరమైన ఆందోళనలు - వ్యవసాయ సంక్షోభం - ఉపాధి అవకాశాలు సన్నగిల్లటం - ధరల పెరుగుదల తదితర అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదనే కోపాన్ని గ్రామీణ ఓటర్లు బీజేపీపై ప్రదర్శించారు. అదే సమయంలో ప్రభుత్వం మౌలిక వసతులకు ఇస్తున్న ప్రాధాన్యత నాయకత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పట్టణాల్లో బీజేపీకి ఓట్లేశారు. ఇదే పరిస్థితి కర్ణాటకలో పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు సందీప్‌ శాస్త్రి విశ్లేషించారు. పట్టణ ప్రాంతాల్లో ఏం చేశామనేదానికన్నా భవిష్యత్తులో ఏం చేస్తామనే హామీలకే విలువ లభిస్తోందని - దాని ఆధారంగా ఓట్లు పడుతున్నాయని ఎన్నికల తీరును పరిశీలిస్తున్న వారు అంచనా వేస్తున్నారు.

కర్ణాటకలో పట్టణ ప్రాంతాల్లో 70 స్థానాలు - గ్రామీణ ప్రాంతాల్లో 154 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మొత్తం పట్టణ నియోజకవర్గాల్లో 28 బెంగళూరు నగరంలోనే ఉండగా - మిగిలిన 42 మున్సిపల్‌ కార్పొరేషన్లు - పట్టణాల్లో ఉన్నాయి. మొత్తం మీద గ్రామీణ నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నాయి. 2013 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బెంగళూరు నగరంలో కాంగ్రెస్‌ కు 13 - బీజేపీకి 12 - జేడీఎస్‌ కు 3 దక్కాయి. పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్‌ కు 40 లభించగా - 2008తో పోలిస్తే 1 స్థానం తగ్గింది. జేడీఎస్‌ 18 నుంచి 30 స్థానాలకు పెంచుకోగలిగింది. బీజేపీ ఘోరంగా దెబ్బతింది. కోస్తా ప్రాంతమైన దక్షిణ కన్నడ ప్రాంతంలో కాంగ్రెస్‌ 18 నియోజకవర్గాల్లో గెలుపొందగా - ఉడిపిలోని 5 స్థానాలకు గాను ఒక చోట గెలుపొందింది. మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న కర్ణాటకను ముంబై కర్ణాటక అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో 56 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 34 - బీజేపీ 14 - యడ్యూరప్ప బీజేపీ (కేజేపీ) 2 - జేడీఎస్‌ - బళ్లారి శ్రీరాములు పార్టీ (బీఎస్‌ ఆర్‌ సీ) ఒక్కొక్కటి చొప్పున గెలుపొందాయి. మధ్య కర్ణాటక ప్రాంతమైన టుంకూరు - ధావనగెరె - చిత్రదుర్గం - శీమోగా జిల్లాల్లో 32 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 18 - జేడీఎస్‌ 5 - బీజేపీ 2 గెలుపొందాయి. తెలంగాణకు ఆనుకుని ఉన్న హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌ 19 స్థానాల్లో గెలుపొందగా - బీజేపీ - జేడీఎస్‌ లు చెరి నాలుగు స్థానాల్లోనే గెలిచాయి. ఈ ఫలితాలను పరిశీలిస్తే 43 మున్సిపాలిటీలు - 65 పట్టణాలు - 92 నగర పంచాయతీలు కీలకమైనవిగా భావిస్తున్నారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు పట్టణ ప్రాంత నియోజకవర్గాల సంఖ్య పెరగటంతోపాటు మొత్తం నియోజకవర్గాల్లో పట్టణాల ప్రభావం ఎక్కువగా ఉండేటట్టు పునర్విభజన జరిగింది. పట్టణ ప్రాంతంలో ప్రస్తుతం బీజేపీకి మెరుగైన పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నప్పటికీ గత రెండు దశాబ్దాల ఓటింగ్‌ సరళిని విశ్లేషిస్తే ఏ పార్టీ కూడా స్థిరంగా తన ఓటుబ్యాంకును పట్టణాలు - నగరాల్లో పదిల పరచుకోలేకపోతోంది. 2008 ఎన్నికల్లో బెంగళూరు నగరంలో బీజేపీ 17 స్థానాలను సాధించుకోగా - కాంగ్రెస్‌ 2013కు వచ్చేసరికి 13 స్థానాలను సంపాదించుకోగలిగింది. 2008లో 17 స్థానాలు పొందిన బీజేపీ 2013కు వచ్చేసరికి దెబ్బతింది. 2013లో బీజేపీకన్నా కాంగ్రెస్‌ కు ఒక స్థానం అధికంగా లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో 121 శాసనసభ స్థానాలకు గాను ఉత్తర కన్నడ ప్రాంతం బీజేపీకి బలమైనదిగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో 60 శాతం పైగా స్థానాలను కాంగ్రెస్‌ సాధించుకోవటానికి బీజేపీ ఓటుబ్యాంకు - బీజేపీ-కేజేపీ-బీఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ లుగా చీలిపోయాయి. అప్పట్లో యడ్యూరప్ప - బీ.శ్రీరాములు బీజేపీ నుంచి బయటకు వచ్చి వేరుకుంపట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ వారు బీజేపీలో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నుంచి గట్టిపోటీని కాంగ్రెస్‌ ఎదుర్కోనుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో. ఇదే సమయంలో బీజేపీలో అంతర్గత తగాదాలు తీవ్రమయ్యాయి. ఇదిలా ఉండగా సిద్దరామయ్య పలుకుబడి పెరగటంతో కాంగ్రెస్‌ మెరుగుపడిందని అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు జేడీఎస్‌ తో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇక గుజరాత్‌ తరహాలో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం సాగిస్తారని సంకేతాలు అందుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే సిద్దరామయ్య గత నెల రోజులుగా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ అనేక పథకాలను అంకితం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఉత్తర కన్నడ జిల్లాల్లో మండోవి నీటి కోసం జరుగుతున్న ఆందోళనలు బీజేపీని కలవరపాటుకు గురిచేస్తుండగా కాంగ్రెస్‌ కు కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గోవా ప్రభుత్వం మండోవి నది నుంచి తాగు - సాగు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌ తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన బంద్‌ కు దారితీసింది. బుధవారం ఉత్తర కన్నడ బంద్‌ విజయవంతమైంది. ఆందోళనకారులు గత వారం రోజులుగా బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. డిసెంబరు 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో యడ్యూరప్ప గోవా ముఖ్యమంత్రి పరిక్కర్‌ తో సమావేశమయ్యారు. నీటిని విడుదల చేసేందుకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. నది నుంచి నీటిని కర్ణాటక సాగునీటి అవసరాల కోసం విడుదల చేసేందుకు తమ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని గోవా ముఖ్యమంత్రి పరిక్కర్‌ యడ్యూరప్పకు లేఖ రాశారు.

ఈ విధమైన ఆందోళనలు రానున్న ఎన్నికలలో ఉత్తర కర్ణాటకలోని రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. 2018 ఏప్రిల్‌ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా లబ్ధిపొందేందుకు బీజేపీ ఈ విధమైన ఎత్తుగడను అమలు చేసింది. అది వికటించటంతో బీజేపీ మరీ ముఖ్యంగా యడ్యూరప్ప పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.

..ఎస్ వి రావు