Begin typing your search above and press return to search.

గుడివాడ 'క్యాసినో ఎఫెక్ట్': పార్లమెంట్ లోనూ ప్రతిధ్వనించింది

By:  Tupaki Desk   |   7 Feb 2022 9:34 AM GMT
గుడివాడ క్యాసినో ఎఫెక్ట్: పార్లమెంట్ లోనూ ప్రతిధ్వనించింది
X
ఏపీలో వివాదాస్పదమైన మంత్రి కొడాలి నాని చుట్టూ ముసురుకున్న గుడివాడ ‘క్యాసినో’ వివాదం పార్లమెంట్ లోనూ ప్రతిధ్వనించింది. ప్రతిపక్ష టీడీపీ దీన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లింది. కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో ఘటనపై తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు.

ఏపీలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం అసాంఘిక చర్యలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల విషయంలో మాట తప్పుతూనే ఉందని ఆరోపించారు.

ఇక టీడీపీ ఎంపీ కనకమేడల మాట్లాడుతున్నసమయంలో వైసీపీ ఎంపీలు అడ్డుపడడంతో వారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వారించారు. అనంతరం ఇచ్చిన సమయం అయిపోయిందంటూ మైక్ కట్ చేశారు.

ఈ క్రమంలోనే కనకమడేల మాట్లాడుతూ ఏపీలో క్యాసినో వ్యవహారాన్ని వెలికితీశారు. రాష్ట్రం మాదకద్రవ్యాలు, గంజాయికి కేంద్రంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియాలు రెచ్చిపోతున్నారన్నారు. అన్యాయాలపై పోరాడితే ప్రతిపక్ష నేతలు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

గుడివాడలో క్యాసినో ఆడించారని టీడీపీ ఎంపీ పార్లమెంట్ లో ఆరోపించారు. ఈ అంశాన్ని లేవనెత్తి ఇరుకునపెట్టారు. వైసీపీ ఎంపీ దీన్ని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు.