Begin typing your search above and press return to search.

మంత్రి గారి మెడకు మెడికల్ కాలేజ్ ....?

By:  Tupaki Desk   |   29 April 2022 1:30 AM GMT
మంత్రి గారి మెడకు  మెడికల్ కాలేజ్ ....?
X
మంత్రిగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ప్రమాణ స్వీకారం చేశారు. అమాత్య కుర్చీ ఎక్కిన తరువాత తన ప్రాంతానికి కొత్త వరాలు ఇవ్వాలి. ఇంకా అభివృద్ధి కూడా చేయాలి. కానీ ఉన్నదే ఊడిపోతే ఎలా. ఇదే ఇపుడు అనకాపల్లి జిల్లాలో చర్చ. అంతేనా విపక్షాలు కూడా దీని మీద ఫైర్ అవుతున్నాయి. ముందు మంత్రి దర్జా కాదు, అనకాపల్లి నుంచి తరలిపోయిన మెడికల్ కాలేజ్ ని తీసుకురావాల్సిందే అంటున్నారు.

దీంతో ఉక్కిరిబిక్కిరి కావడం గుడివాడ వంతు అవుతోంది. నిజానికి 2021లో మెడికల్ కళాశాలు కొత్తగా ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. అందులో అనకాపల్లిలోనే ఒక దాన్ని నెలకొల్పారు. దానికి వర్చువల్ గా సీఎం జగన్ శంఖుస్థాపన చేశారు. అయితే మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే స్థలం వద్దనే వివాదం ఏర్పడింది.

అనకాపల్లిలోని తుమ్మపాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం భూముల్లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. దాని మీద కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ పరిశోధనా కేంద్రాన్ని తరలిస్తే ఊరుకోమని కూడా ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. దాంతో మెడికల్ కళాశాల వివాదంలో పడింది.

అయితే నాడు ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ ఆల్టర్నేషన్ గా మరో ప్రభుత్వ స్థలాన్ని చూసి మెడికల్ కళాశాలను అనకాపల్లిలో ఏర్పాటు చేయించవచ్చు. కానీ ఆయన ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు అన్నది తెలుగుదేశం సహా విపక్షాల ఆరోపణ. దాంతో ఇపుడు ఈ మెడికల్ కళాశాల కాస్తా పరుగులు తీసుకుని మరీ నర్శీపట్నంలోని గొలుగొండకు వెళ్ళిపోయింది.

రీసెంట్ గా అక్కడ ప్రభుత్వ భూములను చూసి వచ్చిన అధికారులు మెడికల్ కళాశాల ఏర్పాటుకు బాగా అనుకూలం అని కూడా నివేదిక తయారు చేశారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అనకాపల్లికి మెడికల్ కళాశాల అన్నది ఇక రానే రాదు, అది పచ్చి నిజం. కానీ ఇపుడు వెళ్ళిపోయిన మెడికల్ కళాశాలను తెమ్మని విపక్షాలు కొత్త మంత్రిని టార్గెట్ చేస్తున్నాయి.

దాంతో ఏమీ చెప్పలేని స్థితిలో మంత్రి గారు పడిపోయారు. మంత్రి ముచ్చట ఇంకా తీరకుండానే ఇలా వివాదంలో ఇరుక్కోవడంతో ఆయన అనుచరులు కూడా డీలా పడుతున్నారు. సరే జరిగిందేదో జరిగింది. అనకాపల్లి కొత్త జిల్లాలో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలను చూసి పట్టాలెక్కిస్తేనే గుడివాడ పేరు నిలిచేది. మరో రెండేళ్ళలో ఎన్నికలు ఉన్న వేళ గుడివాడ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాల్సి ఉందని అంటున్నారు.