Begin typing your search above and press return to search.

గుడివాడ మీదకు గంటా ...?

By:  Tupaki Desk   |   1 May 2022 3:30 AM GMT
గుడివాడ మీదకు గంటా ...?
X
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ రాజకీయాలను మేలి మలుపు తిప్పడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మీద పార్టీ హై కమాండ్ కూడా చాలా ఆశలనే పెట్టుకుంది. గంటా అర్ధ బలం అంగబలం కలిగిన నేత కావడమే కాదు, ఉత్తరాంధ్రా జిల్లాల్లో పట్టు కలిగిన వారు. దాంతో ఆయన పార్టీని గెలిపించడానికి ఇప్పటి నుంచే తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికలనే తీసుకుంటే విభజన జరిగిన విశాఖ జిల్లాలో ఉన్న ఆరు సీట్లలో నాలుగింట ఈ రోజుకీ టీడీపీ ఉంది. దాంతో భీమిలీ, గాజువాకలను కూడా వచ్చే ఎన్నికల్లో గెలుచుకుని తీరుతామని టీడీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే అక్కడ టోటల్ గా వైసీపీదే ఆధిపత్యం. అక్కడ ఉన్న సీట్లు అన్నీ ఆ పార్టీయే 2019 ఎన్నికల్లో గెలుచుకుంది.

ఇక టీడీపీ వైపు చూస్తే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తప్ప గట్టి నేతలు ఎవరూ ఆ పార్టీకి లేరు. వైసీపీ కూడా అనకాపల్లి జిల్లాలో బలంగా ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో గంటా చూపు కొత్త జిల్లా మీద పడింది అంటున్నారు. ముందు అక్కడ నుంచి సెట్ చేసుకుని రావాలని ఆయన చూస్తున్నారు. ఇక మరో వైపు చూస్తే గంటాకు అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని తమ్ముళ్ల నుంచి విన్నపాలు వస్తున్నాయి.

ఈ మూడు చోట్లా ఆయన సామాజికవర్గం బలంగా ఉంది. దాంతో గంటా వీటిలో ఏదో దాంట్లో పోటీకి తానే స్వయంగా దిగుతారు అంటున్నారు. ఈ మూడు చోట్ల టీడీపీ నుంచి నేతలు ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించే సత్తా ఎవరికి ఉంది అన్న చర్చ అయితే ఉంది. దాంతో పాటు వైసీపీ వ్యూహాత్మకంగా ఇద్దరు మంత్రులను అనకాపల్లి జిల్లాకే ఇచ్చింది.

యువ మంత్రిగా గుడివాడ అమరనాధ్ అనకాపల్లి నుంచి ఉన్నారు. ఆయనకు టీడీపీ నుంచి పోటీ ఉన్నా అక్కడ వర్గ పోరు కారణంగా మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. దాంతో గంటా తాను అనకాపల్లి నుంచి పోటీ చేయడం ద్వారా మంత్రి గుడివాడ హవాను అడ్డుకునేలా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు.

గంటా గతంలో అంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి నాటి మంత్రి కొణతాల రామక్రిష్ణను ఓడించారు. ఇపుడు కూడా మంత్రి గుడివాడ మీద తానే పోటీకి దిగేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు అంటున్నారు. అదే కనుక జరిగితే గుడివాడకు కష్టమే అంటున్నారు. గంటాకు అనకాపల్లిలో బలమైన అనుచర వర్గం ఉంది. ఎటూ టీడీపీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. దాంతో గుడివాడ గంటాను తట్టుకోవాలీ అంటే చాలానే శ్రమించాల్సి ఉంటుంది.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు వైసీపీని కంట్రోల్ చేయడంతో పాటు అటు సొంత పార్టీలో అయ్యన్న దూకుడుకు కూడా అడ్డుకట్ట వేసేలా అనకాపల్లి జిల్లా మీద గంటా ప్లాన్ ఉంది అంటున్నారు. మొత్తానికి గంటా చూపు అనకాపల్లి మీద పడింది అంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఈ సీటే హాట్ హాట్ గా మారోబోతోంది అన్నది నిజం.