Begin typing your search above and press return to search.

‘ఈఎంఐ’ల మీదా జీఎస్టీ పన్ను బాదుడు?

By:  Tupaki Desk   |   29 March 2017 4:38 AM GMT
‘ఈఎంఐ’ల మీదా జీఎస్టీ పన్ను బాదుడు?
X
కొత్తగా తీసుకొచ్చే ఏ పన్ను విధానమైనా ప్రజల్నిబాదేయటమే లక్ష్యమన్నట్లుగా ఉంది.తాజాగా జీఎస్టీ తీరు ఇంచుమించు ఇదే తీరులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పన్ను విధానాల్నిపూర్తిగా మార్చేసే విప్లవాత్మకమైన జీఎస్టీ విదానాన్నిఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉంది మోడీ సర్కారు. అయితే.. జీఎస్టీ కారణంగా బాదుడే తప్పించి.. ఎలాంటి భరోసా ఉండదన్న విమర్శ ఉంది.దీనికి బలం చేకూరేలా బయటకు వస్తున్న అంశాలు ఉన్నాయని చెప్పాలి.

దేశంలో అమలవుతున్న పన్ను విధానంలో ఉన్న ప్రధానమైన లోపం..పన్ను విధించే పద్ధతి. పన్ను పరిధిలోకి ఉంచే అంశాలు. పన్ను చెల్లించటానికి మించిన దారులు పన్నులు ఎగ్గొట్టేందుకు ఉండటం పెద్ద లోపంగా చెప్పాలి. అంతేకాదు.. ఆదాయపన్ను పరిధిలోకి రాకుండా దొంగచాటువ్యాపారాలు చేసే కోట్లాది మందిని విజయవంతంగా పన్నుపరిధిలోకి తీసుకొచ్చే విప్లవాత్మకమైన విధానాలకు మోడీ సర్కారు తెర తీయటం లేదన్న విషయం గడిచిన మూడేళ్ల పాలన (ఒకట్రెండు నెలలు తక్కువగా) లో స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.

పన్నుబాదుడు విషయంలో గత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్నే అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం.. యూపీఏ హయాంలో తెర మీదకుతీసుకొచ్చిన జీఎస్టీ బిల్లును తమ హయాంలో అయినా పూర్తి చేయాలని తహతహ లాడుతోంది. ఈ జీఎస్టీ కారణంగా.. పన్ను పరిధిలోకి కొత్తగా వచ్చే అంశాల కారణంగా.. ఇప్పటివరకూ పన్ను పరిధిలోకి రాని అంశాలు కూడా రానున్నాయన్న వాదనలు వినిపించాయి. ఆ మాటలు నిజమేనన్న విషయం తాజాగా ప్రవేశ పెట్టిన జీఎస్టీ బిల్లుల్నిచూసినప్పుడు స్పష్టమవుతుందని చెప్పాలి.

సోమవారం లోక్ సభలో నాలుగు జీఎస్టీ బిల్లులను (1. కేంద్ర జీఎస్టీ బిల్లు.. 2.సమీకృత జీఎస్టీ బిల్లు 3. కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లు 4. రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు బిల్లు) ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుల్ని పరిశీలించినప్పుడు కనిపించే కొత్త విషయం ఏమిటంటే.. జులై 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చే వస్తు సేవల పన్నులో భూమి లీజు.. అద్దె భవనం.. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు చెల్లించే ఈఎంఐలు కూడా పన్ను పరిధిలోకి రానున్న విషయం అర్థమవుతుంది. ప్రతిపాదనలో ఉన్న ఈ అంశాలు పన్ను పరిధిలోకి వస్తే ప్రజల మీద భారం అంతకంతకూ పెరుగుతుందనే చెప్పాలి. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే..పన్ను కట్టే వాడే అన్ని రకాల పన్నులు కట్టాల్సి వస్తోంది.

సింఫుల్ గా అర్థం కావాలంటే..తాజా ప్రతిపాదన చూసినప్పుడు.. ఒక మధ్యతరగతి ఉద్యోగి తన జీతాన్ని (పన్ను చెల్లించిన తర్వాత అందుకునే మొత్తం) ఖర్చు చేసే సమయలో నానా రకాల పన్నుల్ని కడతాడు. పన్ను కట్టిన సంపాదన పైనా పన్నుపోటే. ఇదిసరిపోదన్నట్లు.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ఏ మాత్రం పొందకుండా..తన కష్ఠార్జితంతో బ్యాంకు దగ్గర అప్పుతీసుకొని ఇల్లు కొంటే.. అది నిర్మాణంలో ఉండి.. ఈఎంఐలు కట్టాల్సి వస్తే.. దాని మీదా పన్నుపోటు అంటే అంతకు మించిన భారం ఇంకేం ఉంటుంది.

పేదరికంలో ఉన్నారన్నకారణంగా మూడు.. నాలుగు లక్షల రూపాయిల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇళ్లను ఓట్ల కోసం ఉచితంగా ఇచ్చేసే ప్రభుత్వాలు.. పన్నులు కట్టినఆదాయాన్నిపొదుపుగా వాడుతూ.. ప్రభుత్వం మీద ఆధారపడకుండా తన స్వశక్తిని నమ్ముకొని.. కష్టపడి ఇల్లు అప్పుతో కొన్నప్పుడు.. ఆ మొత్తాన్ని తీర్చేందుకు కట్టే ఈఎంఐల మీదా పన్నుపోటు అంటే అదేమాత్రం సమంజసం కాదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/