Begin typing your search above and press return to search.

జీఎస్టీ ప‌న్ను బాదుడు దేని మీద ఎంతంటే?

By:  Tupaki Desk   |   20 May 2017 6:04 AM GMT
జీఎస్టీ ప‌న్ను బాదుడు దేని మీద ఎంతంటే?
X
గ‌డిచిన రెండు రోజులుగా ఆర్థిక‌మంత్రుల సుదీర్ఘ మ‌థ‌నం ఒక కొలిక్కి వ‌చ్చింది. జులై ఒక‌టి నుంచి అమ‌ల్లోకి రానున్న జీఎస్టీ విధానంలో ప‌న్నుల తీరు మొత్తంగా మారిపోనున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా దేని మీద ఎంత ప‌న్ను విధించాల‌న్న విష‌యం మీద క్లారిటీ తెచ్చేశారు. మొత్తంగా చూసిన‌ప్పుడు.. జీఎస్టీ ప‌న్నుల విధానం ముచ్చ‌ట‌గా మూడు ముక్క‌ల్లో చెప్పాల్సి వ‌స్తే..

సాదాసీదాగా బ‌తికే వారికి జీఎస్టీ ప‌న్ను పోటు ఇబ్బంది లేదు. అత్య‌వ‌స‌రం.. బ‌తికేందుకు కావాల్సిన ముఖ్య‌మైన వాటికి ప‌న్ను పోటు సాధార‌ణంగా ఉండ‌నుంది. ఇక‌.. కాస్త జిహ్వ చాప‌ల్యం ఉన్న వారు.. కాస్త సౌక‌ర్యాలు కోరుకోవ‌టం మొద‌లైన‌ప్ప‌టి నుంచి పోటు పెరుగుతుంది. అది అంత‌కంత‌కూ పెరుగుతుంది. సుఖాన్ని క‌లిగించే సౌక‌ర్యాల‌కు ప‌న్ను బాదుడు ఒక రేంజ్లో ఉంటే.. విలాసాల మీద మోజున్న వారికి మాత్రం చుక్క‌లు క‌నిపించేలా బాదుడును ఫిక్స్ చేశారు. తాజా జీఎస్టీ బాదుడు ప్రకారం నిరుపేద‌కు ఓకే కానీ..దిగువ.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఇబ్బందిగా మారితే.. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఇక‌.. సంప‌న్నుల‌కు మాత్రం కాస్త అసౌక‌ర్యంగా ఉండేలా జీఎస్టీ ప‌న్ను విధానం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. దేని మీద ఎంత ప‌న్ను అన్న‌ది చూసిన‌ప్పుడు మొత్తం 1211 వ‌స్తువుల్లో బంగారం.. బీడీలు.. జౌళి.. పాద‌ర‌క్ష‌లు.. ప్యాకేజ్డ్ ఫుడ్ లాంటి ఐదారు మిన‌హా మిగిలిన అన్నీ వ‌స్తువుల‌కు వ‌ర్గీక‌ర‌ణ పూర్తి అయ్యింది. ఖ‌జానాకు భారీ ఆదాయాన్ని తీసుకొచ్చేలా భారీ సంస్క‌ర‌ణ‌లు తీసుకురానున్నారు. కొన్ని విష‌యాల్లో పెద్ద‌మ‌న‌సుతో వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా క‌నిపించే ప‌న్నుపోటు.. ఆ లోటును తీర్చుకోవ‌టానికి కొన్ని సౌక‌ర్యాల విష‌యానికి వ‌చ్చేస‌రికి నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించిన తీరు క‌నిపిస్తుంది.

దేని మీద ఎంత ప‌న్నుపోటు అన్న‌ది చూస్తే..

= ప‌న్ను లేని వ‌స్తువులు సేవ‌లు..

+ ఆహార ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులకు పూర్తిగా పన్ను మిన‌హాయింపు.

+ బియ్యం - గోధుమలు ఇతర ఆహార ధాన్యాలు - పాలు - పెరుగు - కోడిగుడ్లు - ప్యాకింగ్‌ చేయని పన్నీర్‌ - తేనె - కూరగాయలు - పండ్లు - గోధుమపిండి - బెల్లం - శనగపిండి - మైదా - బ్రెడ్‌ - వెజిటబుల్‌ ఆయిల్స్‌ - ఉప్పు - బొట్లు - కుంకుమ - గాజులు - అప్పడాలు - స్టాంపులు - జుడీషియల్‌ డాక్యుమెంట్లు - ప్రింట్‌ చేసిన పుస్తకాలు - గాజులు - చేనేత వస్తువులు - గర్భనిరోధకాలు ఉన్నాయి.

= 5 శాతం ప‌న్నుపోటు ఉండే వ‌స్తుసేవ‌లు

+ త‌ప్ప‌నిస‌రి కాకున్నా నిత్యం త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించే వ‌స్తుసేవులుగా వీటిని చెప్పాలి. వీటికి 5 శాతం ప‌న్నేశారు.

+ చక్కెర - టీ - కాఫీ - వంట నూనెలు - బొగ్గు - పాలపొడి - పిల్లలకిచ్చే పాలపొడులు - కండెన్సడ్‌ పాలు - ప్యాక్‌ చేసిన పన్నీర్‌ - న్యూస్‌ పేపర్లు - గొడుగులు - కిరోసిన్ - ఎల్‌ పీజీ - చీపుళ్లు - వెన్న - నిల్వ ఉంచిన కూరగాయలు - మసాలా వస్తువులు - చేప మాంసం - పిజ్జా బ్రెడ్‌ - పండ్ల రసాలు - సగ్గుబియ్యం - మందులు - స్టెంట్‌ లు - లైఫ్‌ బోట్‌ లు.

+ విమానం - రైళ్లు - బస్సు టిక్కెట్లు.
(పెట్రోల్‌ ను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించడంతో విమానం.. రైళ్లు.. బ‌స్సు టికెట్లు తక్కువ పన్ను శ్లాబ్‌ లో ఉండ‌నున్నాయి)

= బాదుడు ఓ రేంజ్లో ఉండే 12 శాతం వ‌స్తుసేవ‌లివే..

+ ఇవి వాడ‌కున్నా ఎలాంటి న‌ష్టం ఉండ‌దు. కానీ.. వాడ‌కుండా ఉండ‌లేని దుస్థితి. మారిన కాలంలో నిజ‌జీవితంలో త‌ప్ప‌నిస‌రైన వీటికి 12 శాతం ప‌న్ను బాదుడు బాదేసి.. సామాన్యుడు మొద‌లు కీల‌క‌మైన దిగువ‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి బేజారు ఎత్తించే పన్ను పోటులో ఉండే వ‌స్తుసేవ‌ల జాబితా చూస్తే..

+ వెన్న - నెయ్యి - మొబైల్‌ ఫోన్ లు - జీడిపప్పు - బాదంపప్పు - సాస్‌ లు - ఫ్రూట్‌ జ్యూస్‌ లు - ప్యాక్‌ చేసిన కొబ్బరి నీళ్లు - అగరుబత్తి - ఫ్రోజెన్‌ మాంసాహారం - యానిమల్‌ ఫాట్‌ - మిక్సర్లు - ఆయుర్వేద మందులు - పళ్లపొడి - కుట్టు మిషన్లు - రంగుల్లో ముద్రించిన పుస్తకాలు.

= భారీ బాదుడుకు (18 శాతం) తెర తీసే వ‌స్తుసేవ‌లివే..

+ ఇప్పుడు చెప్పే వ‌స్తుసేవ‌ల చూస్తే.. అరె.. రోజూ వాడేవేనే అనుకోవ‌టం ఖాయం. కానీ.. ఇలాంటి వాటికి వేయ‌నున్న పన్ను ఎంతో తెలుసా? ఏకంగా 18 శాతం. అలాంటి వాటిల్లోకి వెళితే..

+ హెయిర్‌ ఆయిల్స్‌ - సబ్బులు - టూత్ పేస్టులు - పాస్తా - కార్న్‌ ఫ్లేక్స్‌ - జామ్‌ లు - ఐస్‌ క్రీమ్‌ లు - టాయిలెట్‌ పేపర్‌ - ఫేసియల్‌ టిష్యూలు - ఇనుము - స్టీల్‌ - ఫౌంటెన్‌ పెన్నులు - మినరల్‌ వాటర్‌ - కెమెరాలు - స్పీకర్‌ లు - ఎన్వలప్‌ లు - వెంటనే తినే వీలున్న ఆహార ఉత్పత్తులు - వస్తుతయారీకి ఉపయోగించే యంత్ర సామగ్రి - పరిశ్రమల్లో ఉపయోగించే వస్తువులు - టెలికాం - ఫైనాన్షియల్‌ సేవలు.

= చుర్రుమ‌నే (28 శాతం) ప‌న్ను సేవ‌లివే

+ అవ‌స‌రానికి ఎక్కువ‌.. విలాసానికి ద‌గ్గ‌ర‌గా ఉండే వ‌స్తు సేవ‌ల‌పై భారీ ప‌న్ను పోటు. అయితే.. ఈ జాబితాను చ‌దివిన‌ప్పుడు.. అరే.. ఇవి విలాసాలు అవుతాయా? అన్న భావ‌న క‌లిగించే వ‌స్తుసేవ‌లు. ఇలాంటి వాటికి వేసే ప‌న్ను శాతం ఎంతో తెలుసా? ఏకంగా 28 శాతం. అంటే.. వంద రూపాయిల వ‌స్తువులు కొంటే వాటిల్లో 28 రూపాయిలు ప‌న్ను పోటే ఉండ‌నుంది. అలాంటివి ఏమిటంటే..

+ కార్లు - మోటర్‌ సైకిళ్లు - సిమెంట్‌ - చూయింగ్‌ గమ్‌ - కస్టర్డ్‌ పౌడర్‌ - పాన్‌ మషాలా - పెర్‌ ఫ్యూమ్‌ లు - షాంపూ - మేకప్‌ సామగ్రి - బాణాసంచా - వాషింగ్‌ మిషన్లు - పెయింట్లు - డియోడ్రెంట్లు - షేవింగ్‌ క్రీమ్‌ లు - హెయిర్‌ డై - వెండింగ్‌ మిషిన్లు - వాక్యూమ్‌ క్లీనర్లు - డిష్‌ వాషర్లు - హెయిర్‌ క్లిప్పర్లు. ఏసీలు - ఫ్రిజ్‌ లు - చాక్లెట్లు - చాక్లెట్‌ కోటెడ్‌ వేఫర్స్‌ - సన్ స్క్రీన్ లోష‌న్లు - షాంపూలు - ఆప్టర్‌ షేవ్‌ లోషన్లు - రేజర్‌ బ్లేడ్లు - పింగాణీ సామగ్రి - పిస్టల్స్‌ - రివాల్వర్లు - ఫాక్స్‌ మిషిన్లు - రిస్ట్‌ వాచ్ లు - ఇన్సులేటెడ్‌ కాపర్‌ వైర్లు. స్టార్‌ హోటళ్లు - రేస్‌ బెట్టింగ్‌ లు - క్లబ్‌ లు - సినిమా టికెట్లు.

= బాదేసే ప‌న్నుపోటు ఉండే వ‌స్తుసేవ‌లు (ప‌న్నులు+సుంకాలు= తాట తీసే బాదుడు)

- సిగార్‌ ల మీద 109 శాతం పన్ను

- పొగాకు - పొగాకు ఉత్పత్తుల మీద సుంకాలు కలుపుకొని 45 శాతం పన్ను

- పాన్‌ మసాలాల మీద సుంకాలతో కలిపి మొత్తం 44.8 శాతం పన్ను

- శీతల పానీయాల మీద 31.36 శాతం పన్ను

- 350 సీసీ సామర్థ్యం ఉన్న బైక్‌ ల మీద సుంకాలతో కలిపి 28.84 శాతం పన్ను

- మధ్యశ్రేణి - లగ్జరీ కార్ల మీద 32.2 శాతం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/