Begin typing your search above and press return to search.

జీఎస్టీ తాజా సవరింపుతో ప్రయోజనం శూన్యం..ఎందుకంటే?

By:  Tupaki Desk   |   22 Sep 2019 1:30 AM GMT
జీఎస్టీ తాజా సవరింపుతో ప్రయోజనం శూన్యం..ఎందుకంటే?
X
పీనాసి తరహా నిర్ణయాలు తీసుకోవటంలో మోడీ సర్కారుకు మించింది మరొకటి ఉందన్నట్లుగా వ్యవహరించటం కొత్తేం కాదు. గొప్పగా చెప్పుకునే ప్రకటనల్లోనూ గీచి.. గీచినట్లుగా నిర్ణయాలు కనిపిస్తుంటాయి. తాజాగా జరిగిన జీఎస్టీ సమావేశంలో 20 వస్తువులు.. 12 సేవలపై పన్నుల్ని సవరిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మరి.. తాజాగా చేసిన సవరింపులు మహా గొప్ప అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

నిజంగానే జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం ప్రజలకు.. ప్రభుత్వానికి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పాలి. సాధారణంగా జీఎస్టీ సవరింపు కారణంగా.. ప్రభుత్వానికి ఆదాయం తగ్గటం.. ప్రజలకు భారం తగ్గించినట్లు అవుతుందని చెబుతారు. మరి.. తాజా నిర్ణయాలతో ప్రభుత్వానికి ఆదాయం ఏ మేర తగ్గుతంది? ప్రజలకు భారం ఏ మేరకు తగ్గుతుందన్న విషయంలోకి వెళితే.. ఫలితం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తాయి.

ఎందుకంటే.. తాజాగా జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం ఏదీ కూడా ప్రజలకు పెద్ద ప్రయోజనం కలిగించదనే చెప్పాలి. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయంలోకోత పడుతుందనటంలోనూ నిజం లేదని చెప్పాలి. అదెలా అంటే.. హోటల్ గదుల్లో వెయ్యి లోపు అద్దె ఉండే వాటికి పన్ను ఉండదని.. రూ.1001 నుంచి రూ.7500 వరకూ అద్దె ఉండే వాటి జీఎస్టీ 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆరు శాతం తగ్గింపు ప్రయోజనం పెద్దగా ఉండదంటున్నారు. ఒక ఔట్ డోర్ క్యాటరింగ్ పై ఇప్పటివరకూ 18 శాతం జీఎస్టీ కాస్తా 5 శాతానికి తగ్గించినట్లుగా చెబుతున్నారు. ఔట్ డోర్ క్యాటరింగ్ బిజినెస్ మొత్తం కూడా అకౌంట్లో చూపించకుండానే జరుగుతోంది. ఒకవేళ జరిగినా కట్ బిల్లు ఇస్తున్నారు.

చాలామంది ఔట్ డోర్ క్యాటరింగ్ చేసే పెద్ద సంస్థలు సైతం కట్ బిల్లు (లక్ష బిల్లుకు రూ.50వేలు.. అంతకంటే తక్కువ ఇస్తున్నారు) మొన్నటివరకూ 18 శాతంగా ఉన్న పన్ను ఇప్పుడు 5 శాతానికి తగ్గటంతో.. ప్రభుత్వానికే ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక.. వెట్ గ్రౌండర్ల మీద జీఎస్టీ 12 శాతం కాస్తా 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పన్ను భారం తగ్గినా.. కాపర్ వైరు.. ఇతర ముడి సరుకుల ధరల కారణంగా ప్రభుత్వం తగ్గించిన ఏడు శాతం పెరిగే ధరలో సర్దుబాటు చేస్తారు. దీని వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు.

ఇక.. చింతపండు మీద పన్ను అన్నది లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ 5 శాతంగా ఉన్న పన్ను ఇప్పుడు సున్నాగా చేశారు. నిజానికి చింతపండు మీద పన్ను ఉన్నప్పటికీ.. దీని మీద కట్ బిల్ ఇస్తున్నారు. ఇప్పుడు పన్ను లేకుండా చేయటం ద్వారా వ్యాపారులు తాము చేసే టర్నోవర్ ను ఇకపై అధికారికంగా చూపించే వీలు ఉంటుంది.

ఇప్పటివరకూ 5 శాతంగా ఉండే ఆకులతో చేసే కప్పులు.. ప్లేట్లపైనా పన్ను లేకుండా చేశారు. ఇది కూడా ఇప్పటివరకూ అధికారికంగా చూపించకుండానే వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారు. రానున్న రోజుల్లో పన్ను లేని కారణంగా తమ అమ్మకాల్ని మొత్తం చూపించే వీలుంది. దీంతో.. ఆదాయపన్ను కాస్త కట్టాల్సి వస్తుంది తప్పించి.. సామాన్యులకు ఎలాంటి మేలు ఉండదు. మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకూ అనధికారికంగా ఎక్కువగా సాగు వ్యాపారాలపైన ఉన్న పన్ను రాయితీ లేకుండా చేయటం ద్వారా అంతో ఇంతో ప్రభుత్వానికే లాభం తప్పించి.. సామాన్యులకు ప్రయోజనం శూన్యమని చెప్పక తప్పదు.