Begin typing your search above and press return to search.

కొత్త ఇల్లు కొంటున్నారా? వెంట‌నే వాయిదా వేసుకోండి

By:  Tupaki Desk   |   24 Dec 2018 5:47 AM GMT
కొత్త ఇల్లు కొంటున్నారా?  వెంట‌నే వాయిదా వేసుకోండి
X
కొత్త ఇల్లు కొనాల‌నుకుంటున్నారా? అన్ని మాట్లాడేసుకొని డ‌బ్బులు ఇవ్వ‌టానికి రెఢీగా ఉన్నారా? అయితే.. మీరు త‌ప్ప‌కుండా చ‌ద‌వాల్సిందే. ఇల్లు కొంటున్న వారే కాదు.. కొత్తింటి కొనుగోలు మీద ఆస‌క్తి ఉన్న వారు సైతం ఈ స‌మాచారాన్ని తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇంత‌కీ విష‌యం ఏమంటే.. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు.. ఇళ్ల‌పై జీఎస్టీ త‌గ్గ‌నుంది. ప్ర‌స్తుతం కొత్త ఇంటిని కొనుగోలు చేస్తుంటే.. దానికి 12 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. చాలామంది బిల్డ‌ర్లు ఆరు శాతం త‌మ వాటా కింద‌.. మ‌రో ఆరు శాతం కొనుగోలుదారులు చెల్లించాల‌ని చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.30 ల‌క్ష‌లు పెట్టి ఇల్లు కొనేవారు దాదాపు రూ.1.80ల‌క్ష‌ల వ‌ర‌కూ జీఎస్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌.. అధికారికంగా చూపించే మొత్తం రూ.16 ల‌క్ష‌లే అయినా రూ.90వేల వ‌ర‌కూ ప‌న్ను రూపంలో చెల్లిస్తున్న ప‌రిస్థితి.

ఇప్ప‌టికే జీఎస్టీకి సంబంధించి కొన్ని వ‌స్తుసేవ‌ల విష‌యంలో ప‌న్ను రేటును త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ కోవ‌లోకే.. నిర్మాణంలో ఉన్న ఇంటి మీద ప్ర‌స్తుతం విధిస్తున్న 12 శాతం జీఎస్టీని ఐదు శాతానికి త‌గ్గించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. రానున్న కొద్ది నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల మీద బాదుడును త‌గ్గించే అంశాల మీద మోడీ స‌ర్కారు ప్ర‌స్తుతం దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో వ‌చ్చే నెల‌లో జ‌రిగే జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందంటున్నారు.

నిర్మాణంలో ఉన్న ఇంటిపై జీఎస్టీని త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంటే.. ప‌న్ను పోటు భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంది. రూ.30 ల‌క్ష‌ల ఇంటికి ఐదు శాతం జీఎస్టీ అంటే.. బిల్డ‌ర్‌.. కొనుగోలుదారుడు స‌గం.. స‌గం భారం పంచుకుంటే..రూ.75వేలకు త‌గ్గిపోతుంది. ఈ నేప‌థ్యంలో ఈ నెల‌లో ఇంటి కొనుగోలుకు సంబంధించిన నిర్ణ‌యాల్ని ఒక నెల పాటు వాయిదా వేసుకుంటే మంచిద‌న్న అభిప్రాయాన్ని నిర్మాణ రంగ మార్కెట్ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

ఇళ్ల‌పై జీఎస్టీ త‌గ్గింపు అంశం గాలి వార్త కాద‌న్న మాట జైట్లీ వ్యాఖ్య‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతాయి. బిల్డ‌ర్లు 80 శాతం నిర్మాణ సామాగ్రిని రిజిస్ట‌ర్డ్ డీల‌ర్ల నుంచి కొనుగోలు చేస్తార‌ని.. వారిపై జీఎస్టీ ప‌న్నురేటును 5 శాతానికి తగ్గించాల‌న్న ప్ర‌తిపాద‌న జీఎస్టీ కౌన్సిల్‌కు వ‌చ్చింద‌న్న మాట జైట్లీ నోట రావ‌టం అంటే.. వ‌చ్చే నెల‌లో జ‌రిగే స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకునే వీలుంది. సో.. కొత్తింటి కొనుగోలు ఆలోచ‌న ఉన్న వారు.. ఇంటిని డిసైడ్ చేసుకొని.. టోకెన్ అడ్వాన్స్ ఇవ్వ‌టం మేలు. జీఎస్టీ అంశంపై నెల త‌ర్వాత జ‌రిగే స‌మావేశంలో తీసుకునే నిర్ణ‌యానికి త‌గ్గ‌ట్లు ప్లాన్ చేసుకుంటే స‌రిపోతుంది.