Begin typing your search above and press return to search.

‘అగ్నిపథ్’ పై పెరిగిపోతున్న అనుమానాలు

By:  Tupaki Desk   |   27 Jun 2022 5:33 AM GMT
‘అగ్నిపథ్’ పై పెరిగిపోతున్న అనుమానాలు
X
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ నియామకాల విషయంలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అగ్నిపథ్ పథకంలో నియామకాలు అందుకున్న వారిలో 75 శాతం మందిని 4 ఏళ్ళ తర్వాత రిటైర్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తొలగించిన 75 శాతం మందికి కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ రక్షణ విభాగాల్లోను, ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ శాఖలు, రాష్ట్రాల పోలీసు విభాగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

అయితే ఈ హామీ అమలుపైన అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రక్షణ దళాల నుంచి రిటైర్ అయిన సుమారు 27 లక్షల మందిలో అర్హులైన వారినే ఇప్పటివరకు రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయలేదు.

ఇదే సమయంలో హోంశాఖ పరిధిలోని రక్షణ విభాగాల్లో నియామకాలు సాధ్యం కాదని రిటైర్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. అలాగే ఆర్మీ నియామకాలు వేరుగాను పోలీసు శాఖలో నియామకాలు వేరుగా ఉంటాయట. కాబట్టి రెండింటికి ఏ మాత్రం పోలిక లేదంటున్నారు.

అన్నింటికన్నా పెద్ద సమస్య ఏమిటంటే అన్నీ రిజర్వేషన్లు కలుపుకుని 50 శాతం దాటేందుకు లేదు. ఇప్పటికే అన్నీ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు 50 శాతం ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతంకు మించినా అవి సుప్రీంకోర్టు నుండి ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు దాదాపు అవకాశాలు లేవు. పైగా కేంద్రం ప్రకటించిందే కానీ ఆచరణాత్మకమైన విధానాన్ని అమల్లోకి తేలేదు.

ఈ కారణంతోనే చాలా రాష్ట్రాలు ఎలాంటి కార్యాచరణ మొదలుపెట్టలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నోటిమాటగా ప్రకటించారే కానీ అందుకు అవసరమైన ఆదేశాలను జారీ చేయలేదు. ఇక నాన్ బీజేపీ ప్రభుత్వాలైతే అసలు అగ్నిపథ్ పథకాన్ని పట్టించుకోవటమే లేదు.

ఇదంతా ఒకఎత్తైతే నాలుగేళ్ళు పూర్తిచేసుకున్న తర్వాత కంటిన్యు అవబోయే 25 శాతం అగ్నివీరులను త్రివిధ దళాల్లోకి తీసుకోవటం పూర్తిగా త్రివిధ దళాల ఇష్టమే అని నిబంధనను చేర్చింది. దీంతో అగ్నిపథ్ పథకం ప్రక్రియ జనాలను పూర్తిగా అయోమయంలోకి నెట్టేస్తోంది.