Begin typing your search above and press return to search.

భారత్ కు పెరిగిపోతున్న డిమాండ్

By:  Tupaki Desk   |   19 March 2022 11:30 PM GMT
భారత్ కు పెరిగిపోతున్న డిమాండ్
X
చమురు కొనుగోలుకు సంబంధించి అంతర్జాతీయంగా మన దేశానికి డిమాండ్ పెరిగిపోతోంది. ప్రపంచంలోనే పెట్రోల్, డీజల్ అత్యధికంగా ఉపయోగించే దేశాల్లో మన దేశానిది రెండో స్థానం. దీనికి కారణం ఏమిటంటే జనాభానే. జనాభా రీత్యా ప్రపంచంలో రెండో స్ధానంలో ఉన్నది కాబట్టి వాహనాలు కూడా చాలా ఎక్కువే. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా రష్యాపై నిషేధాలు పెరిగిపోతున్నాయి. దీని కారణంగా నిధులు అవసరమయ్యింది.

అవసరమైన నిధుల కోసం రష్యా తన దగ్గరున్న చమురును అంతర్జాతీయ ధరల్లో సగం ధరలకే అందిస్తామని మనదేశానికి బంపరాఫర్ ఇచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. 3.5 మిలియన్ బ్యారెళ్ళ చమురుకు ఆర్డర్ కూడా ఇచ్చేసింది. రష్యా దగ్గర నుండి చమురును కొనటం వల్ల మనకు వచ్చే రెండో లాభం ఏమిటంటే చెల్లింపులన్నీ డాలర్లలో కాకుండా రూపాయిల్లో చేసుకోవటం. దీనివల్ల మన రూపాయికి అంతర్జాతీయంగా పేరొస్తుంది.

ఎప్పుడైతే రష్యాతో ఒప్పందం చేసుకుందో వెంటనే ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. భారత్ ఇంధన అవసరాలను తీర్చటానికి తాము కూడా చమురును సరఫరా చేస్తామంటు ఇరాన్ ప్రతిపాదనలు అందించింది.

మరి ఎంత ధరను ఆఫర్ చేసిందో క్లారిటి లేదు. అయితే తమకు ఎవరైతే తక్కువ ధరలకు చమురును సరఫరా చేస్తారో వాళ్ళే దగ్గరే కొంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజానికి మొన్నటివరకు రష్యా దగ్గర నుండి మనం తెప్పించుకుంటున్న చమురు కేవలం 1 శాతం మాత్రమే. మిగిలిందంతా గల్ప్ దేశాలు, అమెరికాల నుండే వస్తోంది.

అంతర్జాతీయ ధరల్లో సగం ధరకే చమురును ఇస్తామని రష్యా ప్రకటించింది కాబట్టే మనదేశం కొనుగోలును పెంచింది. రష్యా అందిస్తున్న ధరలకు లేదా అంతకన్నా తక్కువ ధరలకు ఇరాన్ సరఫరా చేస్తే మనకు హ్యాపీయే కదా. తమకు చెల్లింపులు రూపాయిల్లో చేసుకోవచ్చని ఇరానే ఆఫర్ ఇచ్చింది.

అంటే చమురు తక్కువ ధరలకు దొరకటమే కాకుండా రూపాయికి అంతర్జాతీయ మారకం పెరుగుతోంది. ఇది మనకు అన్ని విధాలుగా సంతోషదాయకమనే చెప్పాలి. మొత్తానికి భారత్ కు చమురు కొనుగోలులో డిమాండ్ పెరిగిపోతోంది.