Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో గ్రూప్ రాజ‌కీయాల ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   28 Oct 2017 1:30 AM GMT
టీఆర్ ఎస్ లో  గ్రూప్ రాజ‌కీయాల ర‌చ్చ‌
X
రాజ‌ధాని హైద‌రాబాద్‌ త‌ర్వాత తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీ అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే జిల్లాగా టీఆర్ ఎస్ అధినేత‌ - ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి గుర్తింపు పొందిన వ‌రంగ‌ల్‌ టీఆర్ ఎస్ పార్టీలో గ్రూపుల ర‌చ్చ తారాస్థాయికి చేరింది. రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న ఈ జిల్లాలో... సీనియ‌ర్ ఎమ్మెల్యే ఒక‌రు త‌న స‌హ‌చ‌ర ఎమ్మెల్యే...దాదాపుగా త‌నంత సీనియారిటీ క‌లిగి ఉన్న‌ మ‌రో ఎమ్మెల్యేపై బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసే స్థాయికి చేరింది. దీంతో వ‌రంగ‌ల్‌ లోని టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు...త‌మ పార్టీ ప‌రువు ఇలా ప‌లుచ‌న ప‌డిపోతోంద‌ని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో కారుపార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

నగరంలో ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ హాజ‌రైన భారీ బహిరంగసభ ముగిసిన రెండు రోజుల్లోనే వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో వర్గపోరు బహిర్గతమైంది ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు గత మూడు దశాబ్థాలుగా తనను అణిచివేయాలని చూస్తున్నాడని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖ నగరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా విమర్శించారు. అందులో భాగంగానే ఆయన తమ్ముడు ప్రదీప్‌ రావును తూర్పు నియోజకవర్గంలో రేపటి అధికార పార్టీ అభ్యర్థిగా తెరపైకి తేవడానికి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఎవరెన్ని కుట్రలు పన్నినా తాను ఇక్కడ నుండే టీఆర్‌ ఎస్‌ తరపున పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తాటికొండ రాజయ్య ప్రాతినిధ్యం వహించే స్టేషన్‌ ఘన్‌ పూర్‌ నియోజకవర్గంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి - ఎస్సీఎస్టీ కమిటీ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్‌ ల వర్గపోరు రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఏకతాటిన నిలబడుతున్న ఈ కార్యకర్తలంతా ముగ్గురు నాయకులు నేతృత్వంలో మూడు దారుల్లో పయణిస్తున్నందున అక్కడ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని వరంగల్‌ పశ్చిమ - పరకాల - వర్థన్నపేట ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌ - చల్లాధర్మారెడ్డి - ఆరూరి రమేష్‌ ల పనితీరుపై మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. వారి పనితీరు సరిగా లేదని, నియోజకవర్గాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా యని అంచనా వేసి వారి నిర్లక్ష్యం వల్ల లోపించిన సమన్వయం పార్టీ మనుగడను దెబ్బతీసే ప్రమాదంలో ఉంచిందని సీఎం వరంగల్‌ కు వచ్చిన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వారికి ప్రత్యక్షంగా హెచ్చరించడం కూడా జరిగింది. వారి విధానంలో మార్పు రాకపోతే భవిష్యత్‌ ప్రశ్నార్థకమే అన్నట్లు ముందుజాగ్రత్తగా మంత్రి వారికి సంకేతాలు ఇచ్చారు. ఊహించని ఈ పరిస్థితి ఆ శాసన సభ్యులు జీర్ణించుకోవడం లేదు.

జనగామ - పాలకుర్తి - నర్సంపేట - డోర్నకల్‌ - మూడు నియోజకవర్గాల్లో కూడా గ్రూపు తగాదాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుకున్నాయి. ములుగులో మంత్రి చందూలాల్‌ ఆయన తనయుడు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌ పనితీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు అమాత్యున్ని అబాసుపాలు చేస్తున్నాయి. మహబూబాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షుడు ఇటీవల రాష్ట్రపార్టీ కార్యదర్శి పదవీ వరించిన తక్కళ్లపల్లి రవీందర్‌ రావు - ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ గ్రూపుల మధ్య వర్గపోరు మొదలైంది. తక్కళ్లపల్లికి సన్మానం చేసిన సందర్భంగా మొదలైన ఈ లొల్లి కార్యకర్తలను ఆందోళనకు గురి చేసింది. అదే విధంగా డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ - మాజీ ఎమ్మెల్యే ఇటీవల రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియామకం అయిన సత్యవతి రాథోడ్‌ ల గ్రూపుల లొల్లి చాపకింది నీరుగా పుట్టి ముంచే స్థితికి వచ్చింది. అదేవిధంగా పాలకుర్తిలో ఎమ్మెల్యే దయాకర్‌ రావు - మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ రావులతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. నర్సంపేటలో కార్యకర్తలు చూపించిన విబేధాలు అక్కడ ఆపార్టీ ఇన్‌ చార్జ్‌ పౌరసరఫరాల చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డికి ఇబ్బందిగా మారింది. వచ్చే సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వివిధ పార్టీలు సమాయత్తమయ్యే సమయంలో అధికార పార్టీలో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని గులాబీ పార్టీ నేత‌లు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు.