Begin typing your search above and press return to search.

కారులో గ్రూపుల జోరు

By:  Tupaki Desk   |   24 July 2018 2:30 PM GMT
కారులో గ్రూపుల జోరు
X
ప్రత్యేక రాష్ట్రం కోసం సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేసిన తెలంగాణ రాష్ట్రం సమితి గూప్రుల కొట్లాటతో సతమతవుతోంది. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలోనూ పదవులు... అధికారాన్ని అనుభవించిన తెలంగాణ రాష్ట్ర సమితి సాయకులు ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా గ్రూపు తగాదాలతో ఇబ్బందులు పడుతోంది. పైకి అందరూ కలిసి ఉన్నట్లుగా చెబుతున్నా... లోలోపల మాత్రం పార్టీలో గ్రూపుల గోల నానాటికీ పెరుగుతోంది. ఈ గ్రూపు వివాదం పార్టీ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తలనెప్పులు తెచ్చిపెడుతోంది. ఎక్కడికక్కడ గ్రూపుల వివాదలను పరిష్కరించి వచ్చే ఎన్నికల్లో విజయతీరాలకు చేరాలని పార్టీ పెద్దలు భావిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్ధితులు అలా లేవు. దీనికి ఒక జిల్లా అని కాని - ఒక నియోజకవర్గం అని కాని లేదు. తెలంగాణ రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఎన్నికలకు ముందు వీటిని పరిష్కరించి ముందుకు ఎలా వెళ్లాలని ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర రావు పార్టీ పెద్దలతో సమాలోచనలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితిలో ముందు నుంచి ఉన్న వారిని కాదని... తెలుగుదేశం పార్టీ నుంచి... ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పార్టీలో కొందరి వాదన. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినప్పటి నుంచి ఆ జిల్లాలో వివాదాలు ఎక్కువవుతున్నాయి. నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్వర రెడ్డి వొంటెత్తు పోకడలు పోతున్నారంటూ కొందరు ఎమ్మెల్యేలు - పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర అధినేత కె. చంద్రశేఖర రావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో మంచి నాయకుడిగా పేరున్న - వామపక్ష పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన నర్శింహారెడ్డి కూడా మంత్రి జగదీశ్వర రెడ్డి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇక కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటలకు - లోక్‌ సభ సభ్యుడు వినోద్‌ కు మధ్య చాలాకాలంగా పొసగడం లేదు. ఈ ఇద్దరి వివాదాలు పార్టీకి చేటు చేయకతప్పదని అంటున్నారు. ఇక వరంగల్‌ లో కొండా సురేఖ - కొండా మురళీకి జిల్లాలో పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల నుంచి సరైన మద్దతు లభించడం లేదు. వీరిద్దరు పార్టీని వీడితారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇక్కడ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ - పద్మారావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

వీరిద్దరికి తోడు కొత్తగా దానం నాగేందర్ కూడా పార్టీలో చేరడంతో ఈ వివాదాలు ఎక్కడికి పోతాయోనని పార్టీలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు ఏడాది ఉన్న సమయంలో పార్టీలో ఈ లుకలుకలు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తీసుకువస్తాయోనని పార్టీ ముఖ్యులు ఆందోళన చెందుతున్నారు.