Begin typing your search above and press return to search.

ఓటుకునోటు టైంలో..బాబుకు వెన్నుపోటు కుట్ర!

By:  Tupaki Desk   |   7 Jan 2018 11:20 AM GMT
ఓటుకునోటు టైంలో..బాబుకు వెన్నుపోటు కుట్ర!
X
మామను వెన్నుపోటు పొడిచి తాను అధికారంలోకి వచ్చాడని ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండే నారా చంద్రబాబునాయుడు... తాను కూడా ఒక వెన్నుపోటు బారినుంచి తృటిలో తప్పించుకున్నాడంటే మీరు నమ్ముతారా? అంత సులువుగా జీర్ణం కాని విషయమే అయినప్పటికీ.. విశ్వసనీయ పార్టీ వర్గాల ద్వారా - పార్టీ నేతల చర్చల్లో గుసగుసలుగా చెలామణీ అవుతున్న పుకార్ల ద్వారా తెలుస్తున్న సమాచారం ఇది. పార్టీలోనే హఠాత్తుగా ఎంపీ అయిపోయి చక్రం తిప్పుతున్న ఒక కీలక నేత.. అప్పట్లో ఈ కుట్రకు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తున్నది.

ఓటుకు నోటు కేసు బట్టబయలైన తర్వాత, అందులో చంద్రబాబు పాత్ర కూడా ప్రజలకు అర్థమైన తర్వాత.. కోర్టులో విచారణ జరుగుతుండగా.. చంద్రబాబునాయుడు రాజకీయ కెరీర్ ముగిసిపోయినట్లే అనే ఊహాగానాలు కొన్ని వర్గాల్లో నడిచాయి. బాబు ప్రోత్సాహంతోనే ఎంపీగా ఎదిగిన సదరు సీనియర్ నేత చంద్రబాబు సీఎం కుర్చీని కబ్జా చేద్దాం అని పథకం వేశాట్ట. తన ప్లాన్ ను కార్యరూపంలో పెట్టడానికి నెల్లూరు -ప్రకాశం జిల్లాల మధ్యలో ఉండే ఒక స్వామీజీని కూడా కలిసి అక్కడ బేరసారాలు సాగించాట్ట. చంద్రబాబు భవిష్యత్తు డోలాయమానంగా ఉన్న పరిస్థితిని వినియోగించుకుంటూ.. తాను పార్టీలో చీలిక తెస్తానని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను రెండు గ్రూపులుగా చేసి.. ఒక గ్రూపును తన గుప్పిట పెట్టుకోగలనని చెప్పాట్ట. ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యం అని, తన గ్రూపునకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానిక సహకరించేలా బ్రోకరేజీ చేయాలని సదరు స్వామీజీని కోరాడట. తన ప్లాన్ కు తెలంగాణ సర్కార్ తోడ్పాటు కూడా ఉన్నదని చెప్పుకున్నాట్ట.

డీల్ - ఆఫర్ బాగా ఉండడంతో సదరు స్వామీజీ కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ లో టాప్ త్రీ ఒకరుగా ఉండే ఒక నాయకుడిని తన వద్దకు పిలిపించుకుని.. ఆఫర్ వివరాలు తెలియజెప్పాట్ట. సదరు నేత ద్వారా సమాచారం జగన్ వరకు వెళ్లింది. అయితే జగన్ మాత్రం ఇలాంటి వెన్నుపోటు రాజకీయాల్లో మనం వేలుపెట్టాల్సిన అవసరం లేదు.. అని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది.

జగన్ తిరస్కారంతో మొత్తం ఎపిసోడ్ కు అక్కడే తెరపడిపోయింది. లేకపోతే.. ఓటుకు నోటు స్కామ్ సమయంలోనే.. చంద్రబాబుకు వెన్నుపోటు పడి ఉండేదని.. ఏపీలో సర్కారు మారి ఉండేదని ఒక పుకారు నాయకుల మధ్య చెలామణీ అవుతోంది.