Begin typing your search above and press return to search.

కేసీఆర్.. జగన్ భేటీకి గ్రౌండ్ ప్రిపరేషన్

By:  Tupaki Desk   |   24 Aug 2020 1:40 PM IST
కేసీఆర్.. జగన్ భేటీకి గ్రౌండ్ ప్రిపరేషన్
X
విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు అంశాల్లో పంచాయితీలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇద్దరు చంద్రుళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్న వేళలో వారి మధ్య నెలకొన్న విభేదాలు నెలకొన్న నేపథ్యంలో చర్చలు అంత ఫలప్రదంగా సాగని వైనం తెలిసిందే. ఓటుకు నోటు కేసు వ్యవహారంతో పాటు.. ఇద్దరి చంద్రుళ్ల మధ్య నెలకొన్న రాజకీయ పంచాయితీ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించే విషయంలో ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేదు.

ఇదిలా ఉండగా.. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలుమార్లు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావటం.. పలు అంశాల మీద కలిసి పని చేయాలన్న ఆలోచనకు రావటం తెలిసిందే. ఇలాంటివేళ.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు కనిపించని దూరాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. ఇష్యూను మరింత సున్నితంగా మార్చాయి.

ఇలాంటివేళ.. రెండు రాష్ట్రాల మధ్యనున్న జల వివాదాల్ని తమకు తామే పరిష్కరించుకోవాలన్న ఆలోచనకు కేసీఆర్.. జగన్ లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా వీరిద్దరి భేటీ త్వరలోనే జరుగుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా..ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తామిద్దరం కలిసి వివాదాలకు పరిష్కారాల్ని కనుక్కోవాలన్న భావనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ కు కరోనా సోకటంతో తాజా భేటీ వాయిదా పడింది.

ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చక్కటి సంబంధాలు ఉన్న వేళ.. జల జగడాల పంచాయితీకి ఎవరి వద్దకో వెళ్లటం ఎందుకు? మనకు మనమే పరిష్కరించుకుందామన్న ఆలోచనకు ఇరువురు ముఖ్యమంత్రులు రావటం.. వారి సన్నిహితుల ద్వారా సమాచారం అందుకున్న సీఎంలు.. ఈ నెలాఖరులో భేటీ కావాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే.. అధికారికంగా డేట్ ఫిక్స్ కాకున్నా.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశం మాత్రం ఖాయంగా జరుగుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.