Begin typing your search above and press return to search.

అవార్డును రిజెక్ట్ చేయటమే కాదు చురకలేసింది!

By:  Tupaki Desk   |   30 Oct 2019 8:05 AM GMT
అవార్డును రిజెక్ట్ చేయటమే కాదు చురకలేసింది!
X
ఏదైనా అంశం మీద పోరాటం చేస్తున్నారనుకోండి. మీరు చేస్తున్న పోరాటాన్ని అంతర్జాతీయ సంస్థ గుర్తించి అవార్డు ఇస్తే ఏం చేస్తారు? ఆనందంగా స్వీకరిస్తారు. పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా ఫీల్ అవుతారు. కానీ.. అలా అయితే ఆమె గ్రెటా థెన్ బర్గ్ ఎందుకు అవుతుంది. కేవలం పదహారేళ్ల చిరుప్రాయంలోనే పర్యావరణం విషయంలో వివిధ దేశాలు అనుసరిస్తున్న వైఖరిని ఐక్యరాజ్య సమితి వేదికగా కడిగిపారేసిన టీనేజ్ సంచలనం తాజాగా మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది.

84 దేశాలు సభ్యులుగా ఉన్న నోర్డియాక్ కౌన్సిల్ ఎన్విరాన్ మెంటల్ అవార్డును గ్రెటా థెన్ బర్గ్ కు ప్రకటిస్తే.. దాన్ని స్వీకరించేందుకు తాజాగా ఆమె నో చెప్పి రిజెక్ట్ చేసింది. అంతేకాదు.. ఈ పురస్కారం కింద రూ.36 లక్షల నగదు బహుమతికి నో చెప్పేసింది. తన నిర్ణయాన్ని ఇన్ స్ట్రాలోని తన ఖాతా ద్వారా తెలియజేసింది.

నాయకులు ఫోకస్ చేయాల్సింది అవార్డుల మీద కాదని.. పర్యావరణం మీదనంటూ ఆమె తెగేసి చెప్పి.. తాను మిగిలిన వారికి చాలా భిన్నమైన వ్యక్తినన్న విషయాన్ని తన చేతలతో మరోసారి నిరూపించుకుంది. పర్యావరణం మీద చేస్తున్న పోరటానికి అవార్డులు అనవసరం. అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలపై అధికారంలో ఉన్న రాజకీయ నేతలు.. ప్రజలు ఇప్పుడు ఫోకస్ చేయాలని చెప్పింది. అదే సమయంలో తన పోరాటాన్ని గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్పింది.

పర్యావరణ సమస్యల మీద పెట్టాల్సినంత శ్రద్ధను పెట్టటం లేదని నోర్డియాక్ కౌన్సిల్ ను తప్పు పట్టింది. అందమైన పదాలు వాడటం.. గొప్పలు చెప్పుకోవటంలో ఎలాంటి లోటు లేదు.. తలసరి ఉద్గారాల విడుదల తగ్గింపు విషయానికి వస్తే మాత్రం వాస్తవాలు చాలా భిన్నంగా ఉంటాయంటూ.. పర్యావరణం మీద ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న తీరుపై ఆమె తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేయటం గమనార్హం.