Begin typing your search above and press return to search.

ఐదు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రాయాలు మళ్లీ తెరపైకి

By:  Tupaki Desk   |   10 March 2016 11:48 AM GMT
ఐదు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రాయాలు మళ్లీ తెరపైకి
X
ఏపీలో ఉన్న విమానాశ్రయాలు అంతంత మాత్రమే. ఒక్కటీ అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. వైజాగ్ - గన్నవరం - రేణిగుంట విమానాశ్రయాలు అంతంత మాత్రంగానే వున్నాయి. తాజాగా మరో ఐదు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రాయాలను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే గన్నవరం ఎయిర్ పోర్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతాం అని భూ సేకరణ కూడా చేసింది. అయితే ఇప్పటి వరకు ముందడుగు మాత్రం లేదు. అయితే నూతన రాజధాని అమరావతిలో మాత్రం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నిర్మిస్తాం అని చెప్పారు. దానికి కూడా ఇప్పటి వరకు శంకుస్థాపన లేదు.

అయితే తాజాగా రాష్ట్ర బడ్జెట్టులో ఐదు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. భోగాపురం - ఓర్వకల్లు - నాగార్జున సాగర్ - దొనకొండ - దగదర్తి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని వెల్లడించారు. ఇప్పటికే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు భూ సేకరణ కూడా చేసేశారు. అయితే మరికొంత మంది రైతులు భూములు ఇవ్వాల్సివుంది. అలాగే ప్రకాశం జిల్లా దొనకొండలో కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో కూడా మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటు చేయడానికి భూసేకరణ ప్రారంభించారు. మరి 13 జిల్లాలున్న రాష్ట్రంలో ఇన్ని ఎయిర్ పోర్టులు పెట్టడానికి కేంద్రం అంగీకరిస్తుందా అనేది సందేహమే.