Begin typing your search above and press return to search.

త్వరలో విశాఖ - విజయవాడలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   26 Jun 2020 5:00 AM IST
త్వరలో విశాఖ - విజయవాడలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్
X
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా రవాణాను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లాక్ డౌన్ పోయి అన్ లాక్ దశ మొదలైంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అంతరాష్ట్ర, నగరాల్లో మాత్రం బస్సులకు అనుమతి ఇవ్వలేదు. వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారుతుందనే ఉద్దేశంతో ఇప్పటివరకు బస్సులు రాకపోకలు నిషేధించారు. అయితే వైరస్ తో సహ జీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా దశలవారీగా అన్ లాక్ చేస్తున్నారు. దాదాపు అన్ని రంగాలు తెరుచుకున్నాయి.
ఇప్పుడు ఆర్టీసీ సేవలు పూర్తిగా తెరచుకోనున్నాయి. ఈ క్రమంలోనే నగరాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు విజయవాడ, విశాఖపట్టణంలో ఆర్టీసీ సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే విజయవాడ, విశాఖలో సిటీ బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఒకే రేటు ఉండేలా ధరలను నిర్ణయించి సర్వీసులను నడపాలని యోచిస్తోంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులను నడపనున్నారు. కేసులు పెరుగుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుని బస్సు సర్వీసుల్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.

లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెడ్, కంటైన్మెంట్ జోన్ల మినహా జిల్లాల్లో బస్సులు తిరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర బస్సుల విషయానికి వస్తే కర్ణాటక, ఒడిశాకు బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణకు బస్సుల రాకపోకలు ప్రారంభించాలని నిర్ణయించగా దీనిపై వెనకంజ వేశారు. హైదరాబాద్‌లో రోజురోజుకు కేసులు పెరగడంతో తెలంగాణకు ప్రస్తుతం బస్సులు నడపవద్దని నిర్ణయించారు. అవన్నీ లేకుండా ప్రస్తుతం నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే నగరాల్లో బస్సులు నడిచే అవకాశం ఉంది.