Begin typing your search above and press return to search.

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు గ్రీన్ సిగ్నల్?

By:  Tupaki Desk   |   2 Oct 2020 12:45 PM IST
అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణకు గ్రీన్ సిగ్నల్?
X
తాజాగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అమరావతి రాజధానిలో జరిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేట్లే ఉంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఏసిబి విచారణను హైకోర్టు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతకు ముందు మరికొందరిపై ప్రభుత్వం మొదలుపెట్టిన విచారణను కూడా హైకోర్టు నిలిపేసింది. ఇవే అంశాలపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన సుప్రింకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. అవినీతి జరిగిందని ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టగానే హైకోర్టు స్టే ఇవ్వటం ఏమిటంటూ మండిపడింది. అసలు అవినీతి కేసుల్లో విచారణే జరగకుండా దర్యాప్తు ప్రారంభం కాకుండా ఎలా అడ్డుకుంటుందంటూ హైకోర్టును సూటిగా ప్రశ్నించింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తేనే కదా అవినీతి జరిగిందా ? లేదా ? అన్న విషయాలు తెలిసేదంటూ వ్యాఖ్యానించింది. కాబట్టి తాము స్టేలు ఇఛ్చిన కేసుల విషయంలో హైకోర్టే మరోసారి పునఃపరిశీలించాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు వారంలోపు ఈ పనిచేయకపోతే తామే పూనుకుని ఆ పని చేయాల్సుంటుందని చెప్పటం గమనార్హం. అంటే ఒకే అంశంపై ఇటు హైకోర్టు అటు సుప్రింకోర్టు చూసే దృక్కోణంలో ఎంత తేడా ఉందో అర్దమైపోతోంది. అవినీతి కేసుల విచారణలో జోక్యం చేసుకోవద్దని, విచారణలు జరక్కుండా స్టేలు ఇవ్వద్దని గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం కనబడటం లేదంటూ తీవ్రంగానే స్పందించింది.

సుప్రింకోర్టు చేసిన తాజా వ్యాఖ్యల నేపధ్యంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై తొందరలోనే విచారణ మొదలవుతుందని అనుకుంటున్నారు. భూసమీకరణ పేరుతో అప్పట్లో రైతుల నుండి సేకరించిన భూముల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది ప్రభుత్వం అరోపణ. తన ఆరోపణలకు ప్రభుత్వం ఆధారాలను చూపినా హై కోర్టు పట్టించుకోవటం లేదని ప్రభుత్వం మొత్తుకుంటోంది. అలాగే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఇన్ సైడర్ ట్రేడింగ్ లో బాగా లబ్దిపొందాడనే ఆరోపణలపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ ఇందుకు ఆధారాలను సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దమ్మాలపాటితో మరో 13 మందిపై ఏసిబి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టగానే హైకోర్టు అడ్డుకుంది.

తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ఎటువంటి విచారణ జరక్కూడదంటూ దమ్మాలపాటి కోర్టులో కేసు వేయగానే ఆయనకు అనుకూలంగా న్యాయస్ధానం స్టే ఇవ్వటం సంచలనంగా మారింది. స్టే ఇవ్వటమే కాకుండా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ఎక్కడా చర్చలు జరగకూడదని, వార్తలు, కథనాలు రాకూడదన్న గ్యాగ్ ఆర్డర్ పైన కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దమ్మాలపాటే కాదు అప్పట్లో భూసమీకరణలో పాల్గొన్న ఎంఆర్వోలు కూడా భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. వాళ్ళపైన కూడా విచారణ జరపకూడదంటూ హైకోర్టు స్టేలు ఇవ్వటంతోనే అన్నీ కేసులపైన రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రింకోర్టు వ్యాఖ్యలపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.