Begin typing your search above and press return to search.

తాత ఇంట్లో చోరీకొచ్చి ప‌ట్టుబ‌డిన కుర్ర డాక్ట‌ర్‌

By:  Tupaki Desk   |   13 Jun 2017 9:35 AM GMT
తాత ఇంట్లో చోరీకొచ్చి ప‌ట్టుబ‌డిన కుర్ర డాక్ట‌ర్‌
X
ఇంటి దొంగ‌ను ఈశ్వరుడైనా ప‌ట్టుకోలేడు అన్న‌ది పాత సామెత‌. అయితే ట్రెండ్ మారింది. త‌న ఇంట్లో దొంగ‌త‌నానికి వ‌చ్చిన మ‌న‌వ‌డిని తాత‌య్య రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టుకున్నాడు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ‌నివారం మ‌ధ్యాహ్నం ఈ సినీ ఫ‌క్కీ ఘ‌ట‌న జ‌రిగింది.

ఢిల్లీలోని రోహిణీ సెక్టార్ 7లో రామ్‌ లాల్ మిగ్‌ లానీ (80) - భార్య శకుంతల (70)లతో కలిసి జీవిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం త‌న ఆస్తిని రామ్‌ లాల్ అమ్మారు. ఆస్తి అమ్మ‌గా వ‌చ్చిన‌ రూ.50 లక్షలను ఇంట్లోనే దాచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన మనవడు రజత్ (21) ఎలాగైనా ఆ సొమ్మును కొట్టేయాలని మాస్ట‌ర్‌ ప్లాన్ వేశాడు.

ర‌జ‌త్‌ - త‌న స్నేహితుడు రిషబ్ (22)తో కలిసి హెల్మెట్లు ధరించి బొమ్మ తుపాకి - సుత్తితో తాత ఇంట్లోకి దూరాడు. బెడ్రూంలో ఉన్న శకుంతల తలపై సుత్తితో కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. శ‌కుంత‌ల‌ త‌ల‌కు తుపాకి గురిపెట్టి లాకర్ తాళాలు ఇవ్వాలని రామ్‌ లాల్‌ ను డిమాండ్ చేశారు. చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన రామ్‌ లాల్ తాళాలు ఇస్తున్నట్టు నటించి దుండగుడి చేతిపై బలంగా కొట్టారు. రామ్‌ లాల్ కేక‌లు విన్న సెక్యూరిటీ గార్డు - చుట్టుపక్కల వారు వచ్చారు. స్కూటర్‌ పై పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకున్నారు.

తీరా, వారి హెల్మెట్లు తీసి చూసిన‌ రామ్‌లాల్ అవాక్కయ్యారు. వారిలో ఒకడు తన మనవడు రజత్ కావడంతో ఖంగు తిన్నారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన శకుంతలను ఆస్పత్రికి తరలించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/