Begin typing your search above and press return to search.

అమెరికాలో ‘శాతకర్ణి’కి ఫుల్ ఫాలోయింగ్

By:  Tupaki Desk   |   6 Jun 2016 2:26 PM IST
అమెరికాలో ‘శాతకర్ణి’కి ఫుల్ ఫాలోయింగ్
X
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే - టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణకు అమెరికాలో కూడా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయనకు అక్కడ కాలు మోపగానే భారీ రేంజిలో స్వాగతం లభించింది. అమెరికాలోని సియాటెల్ విమానాశ్రయంకు చేరుకున్న బాలయ్యకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి బాలయ్య బస చేయనున్న హోటల్ వరకు పెద్ద సంఖ్యలో కార్లతో ర్యాలీ నిర్వహించిన అభిమానులు బాలయ్యకు మరపురాని రీతిలో స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. తనకు భారీ రేంజిలో ఫాలోయింగ్ ఉండడం.. అభిమానులు అంతగా ఆదరించడంతో బాలయ్య కూడా తెగ ఖుషీ అయ్యారట.

కాగా బాలయ్య అమెరికా పర్యటనలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నడుస్తున్న బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిని మరింత ఆధునికీకరించేందుకు నిధుల సేకరణ చేపట్టనున్నారు. సియాటెల్ లో ఆయన అభిమానులు నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యారు. అక్కడ బాగానే గిట్టుబాటయినట్లు టాక్. ఇక ఈ నెల 10న కాలిఫోర్నియాలో అభిమానులు నిర్వహించే తన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొంటారు.

అయితే... అభిమానులు చుట్టుముడుతున్నా కూడా బాలయ్య చిరాకు పడకుండా వారితో ముచ్చట్లాడుతున్నారట. సెల్ఫీలు దిగేందుకు వస్తున్నవారితో మాత్రం ఆయన కాస్త ఇబ్బందిపడుతున్నా నిధులు కావాలంటే ఈమాత్రం భరించక తప్పదని సర్దుకుపోతున్నారట. మొత్తానికి 50 ఏళ్ల వయసులోనూ విదేశాల్లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో బాలకృష్ణ ను చూసి టాలీవుడ్ యంగ్ హీరోలు నోరెళ్ల బెడుతున్నారట.