Begin typing your search above and press return to search.

ప్రజా రవాణా వాహనాలకు జీపీఎస్...కేంద్రం కొత్త నిర్ణయం

By:  Tupaki Desk   |   2 Jan 2019 3:26 PM IST
ప్రజా రవాణా వాహనాలకు జీపీఎస్...కేంద్రం కొత్త నిర్ణయం
X
ప్రయాణికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వెహికిల్స్ కు జీపీఎస్ ను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు భద్రత లభించనుంది. ముఖ్యంగా మహిళలు - విద్యార్థినులు ఎక్కడికైనా ట్రాన్స్ పోర్టు వాహనాల్లో వెళ్లాలంటే భయపడాల్సిన పని లేదు.

ఒకటో తేదీ నుంచే అమలు

జనవరి ఒకటో తేదీ నుంచే జీపీఎస్ నిబంధనలను అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా - రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రవాణా వాహనాల చట్టం 1989 పరిధిలోకి వచ్చే బస్సులు - టాక్సీ వంటి వాహనాల్లో వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు అమర్చుకోవాలని సూచించింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తోపాటు పానిక్ బటన్ తప్పనిసరని స్పష్టం చేసింది. పాత వాహనాలకు కూడా నిబంధన వర్తిస్తుందని, లేకపోతే ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని పేర్కొంది. జీపీఎస్ కొత్త నిబంధనల ప్రకారం ఏఐఎస్-140 ధ్రువీకరణ ఉన్న ట్రాకింగ్ పరికరాలు మాత్రమే వాహనాల్లో బిగించాల్సి ఉంటుందని తెలిపింది.

జీపీఎస్ తో ప్రయాణికులకు భద్రత

పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయడంతో ప్రయాణికులకు భద్రత పెరగనుంది. దేశంలో కోటి 80 లక్షల ప్రజా రవాణా వాహనాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నేషనల్ పర్మిట్ తో ఉన్న ట్రక్కులు, ఇతర వాహనాలు 70 లక్షలకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మిగతా వాహనాలు ప్రయాణికులను చేరవేసేవే. వీటిల్లో ఇప్పుడు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లవచ్చు. జీపీఎస్ తో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టే వాహనాలను కూడా ట్రేస్ చేసే అవకశాం ఉంది.

బీఎస్ఎన్ఎల్ సహకారంతో ట్రాకింగ్ పోర్టల్

జాతీయ స్థాయి వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ పోర్టల్ ను భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ ఎన్ ఎల్) డెవలప్ చేసింది. వాహనం చాసిస్ నంబరుతోపాటు ట్రాకింగ్ పరికరం వివరాలను పోర్టల్ కు అనుసంధానిస్తారు. రవాణా శాఖతోపాటు పోలీసు శాఖ కూడా ఈ సమాచారాన్ని వినియోగంచుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.