Begin typing your search above and press return to search.

సీఎం ప్ర‌శ్న‌ల‌తో వ‌ణికిపోతున్న‌ అధికారులు

By:  Tupaki Desk   |   7 Aug 2016 10:00 AM GMT
సీఎం ప్ర‌శ్న‌ల‌తో వ‌ణికిపోతున్న‌ అధికారులు
X
నవ్యాంధ్రప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసు మీరుతున్న కొద్దీ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. ఒక శాఖ సమీక్షకు ముందు డేటా రావల్సి ఉంటుంది. అది ఉంటేనే సమీక్ష. లేకపోతే లేదు. అది పాత పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి మార్చేశారు చంద్రబాబు నాయుడు. అధికారుల కంటే ముందే తన ట్యాబ్‌ లో సమాచారం సిద్ధంగా ఉంచుకుంటున్నారు. సర్కారు శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక్క నిమిషంలో తెలుసుకునేందుకు రూపొందించుకున్న డ్యాష్‌ బోర్డు ఇప్పుడు అధికారులను హడలెత్తిస్తోంది. జిల్లాల్లో వర్షపాతం నుంచి ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది హాజరుశాతం నమోదు వరకూ, నిమిషాల్లో సమాచారం డ్యాష్‌ బోర్డులో నిక్షిప్తం చేస్తుండంతో, సీఎం సమీక్షలకు హాజరయ్యే అధికారులు పూర్తి సమాచారంతో వచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారు.

శాస్త్ర - సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకుని హైటెక్ సీఎంగా ముద్రపడిన బాబు - తన మూడో ఇన్నింగ్స్‌ లో పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పరిపాలన సాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో రూపొందించిన సీఎం కోర్ డ్యాష్‌ బోర్డు ఒక్క క్లిక్ ద్వారా పారదర్శకతను ఆవిష్కరిస్తోంది. ఆధార్‌తో అనుసంధానించిన సమగ్ర సమాచారం ఇందులో అందుబాటులో ఉంచారు. మున్సిపల్ శాఖలోని ఆస్తి పన్ను - నీటి సరఫరా - ఆన్‌ లైన్ భవన నిర్మాణ అనుమతులు - స్వచ్చాంధ్ర - క్రైమ్ - ఐ క్లిక్కు - ఈపాస్‌ పోర్ట్ సమాచారాన్ని ఇందులో ఉంచారు. ఉన్నత విద్యలోని కాలేజీ ఎడ్యుకేషన్ - రీసెర్చ్ - యూనివర్శిటీలు - సాంకేతిక విద్య - ఇంజనీరింగ్ కాలేజీల వివరాలు ఇందులో ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్‌ కు సంబంధించిన టీచర్లు - విద్యార్థుల రిపోర్టులు - విద్యుదుత్పత్తి - పంపిణీ లెక్కలు - ఎక్సైజ్ శాఖ సమ్మరీ రిపోర్టులు - ఆర్థిక శాఖ ఖర్చులు - ఇళ్ళ నిర్మాణ పథకంలో జరుగుతున్న ఖర్చు - అభివృద్ధి - పరిశ్రమలకు ఇస్తున్న అనుమతులు - పెండింగ్ ఫైళ్ల వివరాలున్నాయి. గ్రామీణాభివృద్ధిలోని 7 విభాగాల సమగ్ర సమాచారం ఉంది. వివిధ సంక్షేమ శాఖలకు చెందిన కార్యక్రమాల పురోగతి - స్కాలర్‌ షిప్పు - ఫీజు రీయింబర్స్‌ మెంట్ - ఉపాధిహామీ పథకం పనిదినాలకు చెల్లిస్తున్న డబ్బు తదితర వివరాలన్నీ సీఎం కార్యాలయం రియల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ డ్యాష్ బోర్డుద్వారా అందిస్తోంది.

సమీక్షల సందర్భంగా బాబు ఈ వివరాలను ముందుపెట్టుకుని అధికారులను వారి శాఖల పురోగతి ప్రశ్నిస్తున్నారు. అరకొర సమాచారంతో వస్తున్న అధికారులు చెప్పే వివరాలను తప్పుపట్టి, ‘ఈ నిమిషం వరకూ మీ శాఖలో ఉన్న సమాచారం ఇదీ. మీరు ఏవో కబుర్లు చెబుతానంటే ఒప్పుకోను. ఎక్సర్‌ సైజ్ చేసి రావాలి. నా దగ్గర సమాచారం ఉంది. నేను ప్రభుత్వ శాఖలన్నీ పారదర్శకంగా ఉండేందుకు ఇవన్నీ చేస్తుంటే, నాకు సమాచారం ఇవ్వాల్సిన మీరే సగం డేటాతో వస్తే కుదరదు’ అని సున్నితంగా చురకలు పెడుతుండటంతో - అధికారులకు సీఎం సమీక్షలంటేనే హడలు పుడుతోంది. అయితే, దీనిపై అధికారుల స్పందన మరోవిధంగా ఉంది. సీఎం చిత్తశుద్ధిని తప్పుపట్టాల్సిన పనిలేదని, అయితే రోజులో సగభాగం సమీక్షలకే సరిపోతే ఇక మేము ఆఫీసులో కూర్చుని - పనిచేసుకునేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. ‘మాకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. బాగానే ఉంది. కానీ మేము ఆఫీసులో కూర్చుని మా శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలి కదా? వివిధ సమస్యలకోసం వచ్చే ఉద్యోగులు - ప్రజలను కలవాలి. లేకపోతే మేము అందుబాటులో ఉండటం లేదనే అప‌ప్ర‌ద వ‌స్తుంది’ అని ఓ అధికారి వాపోయారు.