Begin typing your search above and press return to search.

చంద్రబాబు పై మండిపడ్తున్న అధికార్లు!

By:  Tupaki Desk   |   28 Oct 2017 7:04 AM GMT
చంద్రబాబు పై మండిపడ్తున్న అధికార్లు!
X
‘కేంద్ర ప్రభుత్వం ఏమైనా మా చెప్పు చేతల్లో నడుస్తున్న సంస్థా... మేం చెప్పినట్టు వినడానికి అక్కడ పాలన సాగిస్తున్న వారు మా వద్ద పనిచేసే బిళ్ల బంట్రోతులా.. కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. మా జీతాల్లో కత్తిరిస్తాం అనడంలో ఔచిత్యం ఏమిటి? అక్కడికేదో.. నిధులు రాకపోతే.. కేవలం అధికార్లది మాత్రమే బాధ్యత అన్నట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడడం భావ్యంగా ఉందా...’’ అంటూ ఏపీలోని సీనియర్ ఐఏఎస్ అధికార్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే.. చంద్రబాబునాయుడు నిర్వహించిన అధికార్ల వీడియో కాన్ఫరెన్సు తర్వాత వారిలో అభిప్రాయం ఇది.

చంద్రబాబునాయుడు ఈ మీటింగులో.. అధికార్లను తీవ్రస్థాయిలో మందలించారు. తాను పట్టించుకుంటే ఒక్క ఫైలు కూడా కదలడం లేదంటూ.. తాను తప్ప మిగిలిన తతిమ్మా ఎవ్వరూ పనిచేయడం లేదన్నట్లుగా ఆయన తన సహజమైన శైలిలో విపరీతమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నిజానికి ఏపీలో చాలా పని ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా సీనియర్ అధికారులు - ఐఏఎస్ లు భావిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో చాలా మంది ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులోకి వచ్చేస్తాం అంటూ కేంద్రానికి దరఖాస్తు పెట్టుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఒకవైపు ఇంత కష్టపడి పనిచేస్తోంటే.. పనుల్లో జరుగుతున్న జాప్యం మొత్తం అధికార్ల పుణ్యమే అన్నట్లుగా చంద్రబాబునాయుడు నిందలు వేయడం అధికార్లను బాధిస్తోంది.

మాటలు చెప్పేవాళ్లు ఎక్కువయ్యారని - పనిచేసేవాళ్లు తక్కువయ్యారని ఆయన వేసిన సెటైర్లు అధికారుల మీదేనా? నాయకుల మీదనా? అనే తర్జన భర్జన కూడా వారిలో నడుస్తోంది. చంద్రబాబునాయుడు ఏదో తాను వెంటబడితే తప్ప ప్రభుత్వం పనిచేయడం లేదన్నట్లుగా ప్రజల ముందు ఒక బిల్డప్ ఇచ్చుకోవడానికే ఇలా మాట్లాడుతున్నారేమో గానీ.. వాస్తవానికి ప్రభుత్వంలో రెడ్ టేపిజం పెరిగిపోతున్నదని, అసలు పనుల కంటె కొసరు పనులు ఎక్కువ అయిపోతున్నాయని, ఒకరోజు మీటింగ్ అన్నారంటే.. గంటలు గంటల ఎదురుతెన్నులు నిరీక్షణలు ఇలా.. రోజంతా పని వృథా అయిపోతున్నదని అధికారులు పలురకాలుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.