Begin typing your search above and press return to search.

ప‌న్ను క‌ట్టే ఉద్యోగుల‌పై అంత ప‌గ ఏల జైట్లీ?

By:  Tupaki Desk   |   1 Feb 2018 8:19 AM GMT
ప‌న్ను క‌ట్టే ఉద్యోగుల‌పై అంత ప‌గ ఏల జైట్లీ?
X
క‌ష్టాలు ఎన్ని ఉన్నా స‌రే.. నెల గ‌డిచేస‌రికి వ‌చ్చే జీతంలో నుంచి ఆదాయ‌ప‌న్నును బుద్దిగా క‌ట్టే వారిలో ఉద్యోగులు ముందుంటారు. ప్ర‌భుత్వ‌మా.. ప్రైవేటా అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఆదాయ‌ప‌న్ను క‌ట్టే విష‌యంలో దేశంలోని మ‌రే ఇత‌ర వ‌ర్గాల కంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండే వారు ఉద్యోగులు. వ్య‌క్తిగ‌తంగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. నిత్యం జీఎస్టీ పేరుతో భారీ బాదుడు మీద ప‌డుతున్న భ‌రిస్తూ.. ఆదాయ‌ప‌న్నును క‌ట్టేస్తుంటారు.

ఇలాంటి వారు ప్ర‌తిఏటా కేంద్రం త‌న బ‌డ్జెట్ లో ఎంతోకొంత ఆదాయ‌ప‌న్ను రాయితీని ఆశిస్తుంటారు. నిజానికి ఉద్యోగుల‌కు వ‌చ్చే జీతానికి.. వారు క‌ట్టే ఆదాయ‌ప‌న్నుకి సంబంధం ఉండ‌దు. ప‌న్ను క‌ట్టే ఉద్యోగుల‌కు ప్ర‌త్యేక రాయితీలు ఇవ్వ‌ని ప్ర‌భుత్వం.. ఈసారి ప‌న్ను రాయితీ విష‌యంలో మొండిచేయి చూపించారు.

ఎన్నిక‌ల బ‌డ్జెట్ కావ‌టం.. జైట్లీ చివ‌రి పూర్తిస్థాయి బ‌డ్జెట్ కావ‌టంతో ఉద్యోగుల విష‌యంలో ఎంతోకొంత కనిక‌రం చూపిస్తార‌న్న భావ‌న ప్ర‌తిఒక్క‌రిలో క‌నిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే ఎవ‌రికి వారు కొన్ని అంచాల‌తో ఆశ‌గా జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని విన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా త‌న ప్ర‌క‌ట‌న‌తో ఉద్యోగుల‌కు భారీ షాక్ ఇచ్చారు జైట్లీ. ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపుల ప‌రిమితుల్లో ఎలాంటి మార్పులు లేవ‌ని..ఇప్పుడు అమ‌లు చేస్తున్న విధానాన్ని య‌థావిధిగా ఉంచిన‌ట్లుగా ప్ర‌క‌టించారు.

రాష్ట్రప‌తి.. ఉప‌రాష్ట్రప‌తి.. గ‌వ‌ర్న‌ర్ల గౌర‌వ వేత‌నాన్ని పెంచిన‌ట్లు ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. ఎంపీల గౌర‌వ వేత‌నాన్ని ద్ర‌వ్యోల్బ‌ణం ఆధారంగా ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి స‌మీక్షించి పెంచుతామ‌ని చెప్పిన జైట్లీ.. కోట్లాది మంది ఉద్యోగుల విస‌యానికి వ‌స్తే మాత్రం చేతులు ఎత్తేశారు. అదే స‌మ‌యంలో ప్ర‌యాణ‌.. వైద్య ఖ‌ర్చుల‌కు మాత్రం రూ.40వేల వ‌ర‌కు ప‌న్ను రాయితీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఇది కూడా వ్య‌క్తిగ‌త వ్యాప‌ర‌స్తుల కంటే ఎక్కువ‌గా ప‌న్నులు చెల్లిస్తున్న ఉద్యోగుల‌కని పేర్కొన్నారు. ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి కొత్త‌గా 5 ల‌క్ష‌ల మంది చేరిన‌ట్లు చెప్పిన జైట్లీ.. ఉద్యోగుల ఆదాయ‌ప‌న్ను కార‌ణంగా ప్ర‌భుత్వానికి రూ.90వేల ఆదాయం వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. అంటే.. అటుఇటుగా ల‌క్ష కోట్ల ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగుల విష‌యంలో కేంద్రం మొండిచేయి చూప‌టంపై ఉద్యోగ వ‌ర్గాలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాయి.