Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్- కేసీఆర్ వివాదం.. కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు

By:  Tupaki Desk   |   20 March 2023 9:08 PM GMT
గ‌వ‌ర్న‌ర్- కేసీఆర్ వివాదం.. కేంద్రానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు
X
గ‌త కొన్నాళ్లుగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌కు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదం జ‌రు గుతున్న విష‌యం తెలిసిందే. అనేక సంద‌ర్భాల్లో ఇరు పక్షాల మ‌ధ్య విభేదాలువెలుగు చూశాయి. అయితే.. ప్ర‌భుత్వం ఆమోదిం చిన బిల్లుల‌ను తొక్కి పెట్ట‌డం.. మ‌రింత‌గా ప్ర‌భుత్వానికి-గ‌వ‌ర్న‌ర్‌కు మ‌ధ్య వివాదాన్ని రాజేసింది. దీనిపై కేసీఆర్ స‌ర్కారు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఈ పిటిష‌న్ల‌పై విచారించిన సుప్రీం కోర్టు కేంద్ర ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేయ‌మంటారా? అని నిల‌దీసింది. దీంతో క‌థ సుఖాంత‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఏం జ‌రిగింది?

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తొక్కిపెట్టారంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామని వ్యాఖ్యానించింది. గవర్నర్‌ తరఫున స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. నోటీసు అక్కర్లేదని ఏం జరుగుతుందో తెలుసుకుంటానని కోర్టుకు తెలిపారు.

శాసనసభ ఆమోదించిన బిల్లులు.. ఈమధ్యే రాజ్‌భవన్‌కు వచ్చాయని సుప్రీంకోర్టుకు తెలిపిన తుషార్‌ మెహతా.. బిల్లుల ఆమోదంపై పురోగతి తెలుసుకొని చెబుతానని చెప్పారు. నోటీసులు జారీ చేయవద్దని సుప్రీంకోర్టుకు విన్నవించిన సొలిసిటర్‌.. రాజ్యాంగబద్ధమైన పదవి దృష్ట్యా నోటీసులు జారీ చేయొద్దని కోరారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

ఇదీ వివాదం..

గత సంవత్సరం సెప్టెంబరు నుంచి 7 బిల్లులు.. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆమోదించుకున్న 3 బిల్లులు కలిపి మొత్తం 10 బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టారు. 163వ ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ సలహా మేరకు గవర్నర్ విధులు నిర్వహించాలి తప్ప.. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ షంషీర్ సింగ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ ప్ర‌భుత్వం సుప్రీం గ‌డ‌ప తొక్కింది.

ఇప్పుడు ఏం జ‌రుగుతుంది.?

సుప్రీం కోర్టు ఏకంగా కేంద్రానికినోటీసులు జారీ చేయాల‌ని నిర్ణ‌యించ‌డం.. వ‌ద్ద‌ని తుషార్ మెహ‌తా కోర‌డం నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ ఈ విష‌యంలో జోక్యం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా గ‌వ‌ర్న‌ర్‌కు కేంద్రం నుంచి ఆదేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. త‌ద్వారా ఆమె బిల్లుల‌ను ఆమోదించ‌డం త‌ప్ప‌ద‌ని న్యాయ‌నిఫుణులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.