Begin typing your search above and press return to search.

గవర్నర్ పై టీఆర్ఎస్ ఎదురుదాడి..

By:  Tupaki Desk   |   6 April 2022 3:30 PM GMT
గవర్నర్ పై టీఆర్ఎస్ ఎదురుదాడి..
X
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ పై యుద్ధానికి దిగగానే.. ఇక్కడ హైదరాబాద్ లో గులాబీ శ్రేణులు రెచ్చిపోయారు. దీంతో మరోసారి గవర్నర్ వర్సెస్ టీఆర్ఎష్ ఫైట్ మొదలైంది. గవర్నర్ ఒక మాట అనగానే.. అందుకు ప్రతిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా అదే స్తాయిలో ప్రతిస్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీకి కేసీఆర్ సర్కార్ పై గవర్నర్ ఫిర్యాదు చేశారనే చర్చకు తెరలేసింది.

ఇటీవల పలు సందర్భాల్లో కేసీఆర్ సర్కార్ పై గవర్నర్ కామెంట్స్ సంచలనమయ్యాయి. తాజాగా ఢిల్లీ వెళ్లి మరీ తమిళిసై ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసి టీఆర్ఎస్ పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి రెచ్చిపోయారు. గవర్నర్ పై హాట్ కామెంట్ చేశారు.

రాజ్ భవన్ లోకి గవర్నర్ రాజకీయాలు తెచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తమిళిసై బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆమె వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని బీజేపీ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. గవర్నర్ గా వస్తే గౌరవించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాజకీయ పార్టీ నేతగా వస్తే గౌరవించాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. ప్రొటోకాల్ పాటించడం లేదనేది పూర్తిగా అవాస్తవమన్నారు.

పెద్దలను గౌరవించడాన్ని కేసీఆర్ తమకు నేర్పించారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గవర్నర్ వస్తున్నారంటే ముఖ్యమంత్రి స్వాగతం పలికి గౌరవం ఇస్తారన్నారు.కానీ గవర్నర్ అలా ఎందుకు స్పందించారో తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ సందర్భంలో రాజ్యాంగాన్ని వ్యవస్థలను గౌరవించలేదో చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, వ్యవస్థలను గౌరవించాలని గవర్నర్ కామెంట్ చేసిన నేపథ్యంలో మంత్రి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు గ్యాప్ ఉందని తామెప్పుడూ చెప్పలేదని జగదీష్ రెడ్డి అన్నారు. కానీ మీడియా ముందుకొచ్చి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహించారు.

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సేవారంగానికి చెందిన వారని రిజెక్ట్ చేశారని.. కానీ రాజకీయం సేవారంగమేనని మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ వ్యవస్థకు రాజకీయ వ్యక్తి అయిన తమిళిసైని ఎలా నియమించాలో ఇది అంతేనన్నారు.