Begin typing your search above and press return to search.

తమిళ సై హామీ ఇచ్చారు..క్యాబ్ డ్రైవర్లు సమ్మెను విరమించారు

By:  Tupaki Desk   |   20 Oct 2019 5:25 AM GMT
తమిళ సై హామీ ఇచ్చారు..క్యాబ్ డ్రైవర్లు సమ్మెను విరమించారు
X
గడిచిన పదహారు రోజులుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. దాదాపు 48వేలకు పైనే ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు.. వారి డిమాండ్లను పరిశీలించాల్సిన బాధ్యత.. చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. అందుకు భిన్నంగా అలాంటివేమీ చేయకపోగా.. ఉద్యోగులకు అల్టిమేటం విధించి.. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు తెలిసిందే.

ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే.. సమ్మెను విరమించే విషయంలో తాము రెండు అడుగులు వేస్తామన్నట్లు ఉద్యోగ సంఘాల వారు సంకేతాలు ఇచ్చినా.. భేషరుతుగా సమ్మెను విరమించి.. క్షమాపణలు చెప్పాలంటూ పట్టు పట్టిన ముఖ్యమంత్రి తీరుతో సమ్మె ముఖచిత్రం అంతకంతకూ పెరిగి పెద్దది అవుతుందే తప్పించి తగ్గని దుస్థితి.

ఒకవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలవటమే కాదు.. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ కోరుతోంది. ఇందులో భాగంగా శనివారం నుంచి తాము సమ్మె బాట పడతామంటూ వారు కోరుతున్నారు. ఇలాంటి వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ల జేఏసీ నాయకులకు ఏకంగా గవర్నర్ అపాయింట్ మెంట్ లభించటం.. తమ సమస్యల్ని గవర్నర్ ముందుకు తీసుకెళ్లటం లాంటివి చోటు చేసుకున్నాయి.

వారి వినతిపత్రం మీద స్పందించిన గవర్నర్ తమిళ సై తనకు మంగళవారం వరకూ సమయం ఇవ్వాలని.. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వ్యవహరించాలని కోరారు. గవర్నర్ స్పందించిన తీరుతో తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ జేఏసీ సమ్మె నుంచి పక్కకు తప్పుకునేందుకు సిద్దమయ్యారు.

తమ సమస్యలపై గవర్నర్ తమిళ సై ఇచ్చిన హామీ మేరకు తాము సమ్మెను విరమిస్తున్నట్లుగా పేర్కొన్న క్యాబ్ డ్రైవర్లు.. ఎప్పటిలానే తమ సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. గవర్నర్ కోరిన గడువు పూర్తి అయ్యే వరకూ వెయిట్ చేస్తామని.. ప్రభుత్వం ఆ లోపు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించని పక్షంలో తాము మళ్లీ సమ్మె బాట పడతామని ప్రకటించారు.

గవర్నర్ తీరుపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న క్యాబ్ డ్రైవర్ల జేఏసీ.. ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందన్న దానిపైన ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన చేతలతో సమ్మెను తాత్కాలికంగా విరమించేలా చేసిన గవర్నర్.. సీఎం కేసీఆర్ లో ఏం మిస్ అయ్యిందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సీఎం ఇదే తీరులో స్పందించి ఉంటే.. విషయం ఇంతవరకూ వచ్చేది కాదన్నట్లుగా మారింది.

అంతేకాదు.. క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరాన్ని గవర్నర్ తీసుకొచ్చారని చెప్పాలి. వినతిపత్రం తీసుకొని సమయాన్ని ఇవ్వాలని కోరి.. తానే గడువు చెప్పేసిన నేపథ్యంలో.. క్యాబ్ డ్రైవర్ల సమస్యల విషయంలో ప్రభుత్వం ఏ మేరకు రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.