Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు ట్వీట్ చేసే బదులు ఎవరికి ట్వీట్ చేస్తే బెటర్ అంటే?

By:  Tupaki Desk   |   22 Oct 2019 5:30 AM GMT
కేటీఆర్ కు ట్వీట్ చేసే బదులు ఎవరికి ట్వీట్ చేస్తే బెటర్ అంటే?
X
తెలంగాణ రాష్ట్రంలో నేతలు బోలెడంత మంది ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముందుంటారు. అవసరానికి తగ్గట్లుగా రియాక్ట్ అవుతూ.. ప్రభుత్వానికి డ్యామేజ్ కంట్రోల్ గా వ్యవహరిస్తుంటారు. అంతేకాదు.. తన ఇమేజ్ ను పెంచేందుకు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాను ఆయన ఉపయోగిస్తుంటారు. ఏదైనా సమస్యను ఆయనకు పోస్ట్ చేసినా.. ట్యాగ్ చేసినా స్పందన వెంటనే వచ్చేది. ట్వీట్ లో పేర్కొన్న సమస్యను పూర్తి చేసే వరకూ అధికారుల్ని విడిచిపెట్టేవారు కాదు.

అయితే.. ఇటీవల కాలంలో కేటీఆర్ లో ఆ వేగం.. చురుకుదనం తగ్గిందన్న మాట వినిపిస్తోంది. హైదారాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న అక్రమ కట్టటాలు.. కబ్జాల మీద మంత్రి కేటీఆర్ కు అదే పనిగా ఫిర్యాదులు వస్తున్నా.. వాటికి స్పందిస్తున్న వైనం సరిగా లేదంటున్నారు. తాము ఎంతో నమ్మకంగా కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు ట్వీట్ చేస్తుంటే ఆయన నుంచి స్పందన కరువైందంటున్నారు.

ఈ మధ్యనే రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళసై.. తనకొచ్చిన సమస్యల విషయంలో అధికారుల్ని పరుగులు పెట్టించటమే కాదు.. ఇష్యూ ఏమైందన్న విషయాన్ని ఆమె ఒకటికి రెండుసార్లు అడుగుతున్న వైనంతో సమస్యలకు పరిష్కారం ఇట్టే లభిస్తోంది. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి తెర మీదకు వచ్చింది.

జూబ్లీహిల్స్ లోని పద్మాలయ అంబేడ్కర్ నగర్ లో నివాసం ఉండే శ్రీనివాస్ కు 60 గజాల స్థలం ఉంది. అధికారులు చేసిన తప్పుల కారణంగా పట్టా మద 15 గజాలే ఉన్నట్లు ప్రింట్ అయ్యింది. దీన్ని అవకాశంగా చేసుకున్న కొందరు బస్తీ లీడర్లు సదరు వ్యక్తికి చెందిన స్థలాన్ని కబ్జా చేశారు. దీని మీద మంత్రి కేటీఆర్ కు.. హైదరాబాద్ కలెక్టర్ కు ఫిర్యాదులు చేశారు. ట్వీట్ తో పలుమార్లు గుర్తు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

ఈ నేపథ్యంలో తాను ఎదుర్కొంటున్న సమస్య మీద గవర్నర్ తమిళ సైకు ట్వీట్ చేశారు. అనూహ్యంగా ఈ ట్వీట్ కు స్పందన రావటమే కాదు.. గవర్నర్ ను కలిసేందుకు.. గోడు వెళ్లబోసుకునేందుకు అవకాశం లభించింది. గవర్నర్ ను కలిసి.. జరిగినదేమిటో వివరించాడు శ్రీనివాస్. వెంటనే స్పందించిన గవర్నర్ కారణంగా.. కబ్జా కట్టడాన్ని కొట్టేయటమే కాదు.. ఆ స్థలం ప్రభుత్వానిదంటూ ఒక బోర్డు పెట్టారు. అదే పనిగా కేటీఆర్ కు.. కలెక్టర్ కు ట్వీట్లు చేస్తే స్పందించని తీరుకు భిన్నంగా గవర్నర్ కు ట్వీట్ చేసిన వెంటనే ఫలితం రావటమే కాదు.. సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే రీతిలో రానున్న రోజులు కూడా సాగితే.. కేటీఆర్ కు ట్వీట్లు చేయటం మానేసి.. గవర్నర్ కు పోస్ట్ చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.