Begin typing your search above and press return to search.

బంపర్‌ ఆఫర్‌ అంటే నరసింహన్‌కే..!

By:  Tupaki Desk   |   26 Jun 2015 4:14 AM GMT
బంపర్‌ ఆఫర్‌ అంటే నరసింహన్‌కే..!
X
జాతీయ రాజకీయాల్ని సైతం ప్రభావితం చేసి.. తనదైన శైలిలో చక్రం తిప్పిన నేత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం.. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేలా.. ఉద్యమ మార్గంలో సుదీర్ఘంగా పోరాడి.. కొత్త రాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమ నేత.. రాజకీయ మేధావిగా పేరు పడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాన్ని ఏక కాలంలో ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించే అద్భుతమైన అవకాశం నరసింహన్‌కు దక్కింది.

దేశంలో ఎన్నో రాష్ట్రాలు.. వాటికి గవర్నర్లు ఉన్నా.. నరసింహన్‌లాంటి పవర్‌ ఫుల్‌ గవర్నర్‌ మాత్రం ఎక్కడా కనిపించరు. మాజీ పోలీస్‌బాస్‌గా.. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడిగా ఉంటారన్న పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి. ఏన్డీయే పవర్‌లోకి వచ్చాక.. మోడీ లాంటి బలమైన ప్రధానిగా ఉన్న సమయంలోనూ గవర్నర్‌ పోస్ట్‌లో నరసింహన్‌ కొనసాగుతున్నారంటే అది ఆయన గొప్పతనంగానే చెప్పాలి.

సాధారణంగా ముఖ్యమంత్రుల ఆగ్రహానికి గవర్నర్లు బలైపోతుంటారు. వీలైనంత అండర్‌ప్లే చేస్తూ.. పరిపాలనలో వేలు పెట్టకుండా తమ దారిన తాము ఉండిపోతుంటారు. రబ్బర్‌స్టాంప్‌గా తాము చేయాల్సిన సాంకేతిక పనుల్ని పూర్తి చేస్తుంటారు. సాధారణంగా గవర్నర్‌ అన్న పేరు వినిపించగానే ఆయన చేసే పనుల గురించి ఇలాంటి అభిప్రాయాలే ఉంటాయి.

వాటికి భిన్నంగా రాజకీయాల్లోనే కాదు.. పవర్‌ఫుల్‌ రాజకీయ నేతలుగా పేరు ప్రఖ్యాతులున్న నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో చక్రం తిప్పటానికి గవర్నర్లకు ఎలాంటి అవకాశం ఉండదు. కాస్తంత పచ్చిగా చెప్పాలంటే ఉత్సవ విగ్రహంగా మాత్రమే ఉంటారు. అలాంటిది నరసింహన్‌కు ఉన్న అవకాశాన్ని చూసిన గవర్నర్లు అంతా అసూయ పడే పరిస్థితి.

ఇరువురు ముఖ్యమంత్రుల మొదలు.. ఆయా రాష్ట్ర మంత్రుల వరకు నిత్యం కలుసుకోవటం.. డీజీపీ.. సీఎస్‌లో ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వటమే కాదు.. కేంద్రహోంమంత్రితో నిత్యం టచ్‌లో ఉండటంతో పాటు.. తరచూ రాష్ట్రపతి.. ప్రధానమంత్రిని కలిసే అవకాశం కూడా నరసింహన్‌కు మాత్రమే దక్కిందని చెబుతుంటారు. మొత్తంగా బంపర్‌ ఆఫర్‌ అంటే నరసింహన్‌కే అన్న మాట రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తుండటం గమనార్హం.