Begin typing your search above and press return to search.

ఆయనే ఉంటే..!

By:  Tupaki Desk   |   10 July 2015 5:30 PM GMT
ఆయనే ఉంటే..!
X
తెలుగులో ఒక సామెత ఉంది. ఆయనే ఉంటే మంగలి ఎందుకనేది ఆ సామెత! ఇది కొంచెం నాటు సామెతే కానీ.. గవర్నర్‌ నరసింహన్‌ వైఖరి నేపథ్యంలో ఏపీ అధికారులు దీనినే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూలు సమస్యలకు సంబంధించి తెలంగాణ చేస్తున్న వాదన తప్పని, ఇది తమ వాదన అంటూ ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తదితరులు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. దాంతో మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరూ మీరూ కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా అంటూ ఆయన ఓ ఉచిత సలహా పాడేశారు.

రాష్ట్ర విభజన జరిగిన మొదటి రోజు నుంచీ తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థలపై వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఏపీకి చెందిన అధికారులపై తెలంగాణలో దాడులు చేశారు కూడా. వీటి నిధుల విడుదల వ్యవహారమూ వివాదాస్పదమైంది. ఈ అంశాలన్నీ ఎప్పటికప్పుడు గవర్నర్‌కు చేరుతూనే ఉన్నాయి. కొన్నిటి విషయంలో తెలంగాణ నాయకులు ఫిర్యాదు చేస్తే మరికొన్నిటి విషయంలో ఏపీ అధికారులు ఫిర్యాదులు చేశారు. వీటిలో సమస్యలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేకసార్లు కలిసి కూర్చుని పరిష్కరించుకుందామని ప్రతిపాదించిందని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకసార్లు బహిరంగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ రాష్ట్ర అధికారులకు పిలుపులు ఇచ్చారని, అయినా ఎవరూ స్పందించలేదని ఏపీ అధికారులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని పరిష్కరించుకునే అవకాశమే ఉంటే గవర్నర్‌ వరకూ ఎందుకు వెళతామని ప్రశ్నిస్తున్నారు. అంతా తెలిసినా గవర్నర్‌ ఏపీ విషయంలో ఇటువంటి పక్షపాతపూరిత ధోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు సంబంధించి వివాదం వచ్చినప్పుడు తెలంగాణ అధికారులో నాయకులో ఫిర్యాదు చేసినప్పుడు వారికి సూచన సలహాలు ఇస్తున్న గవర్నర్‌.. ఏపీ అధికారులను మాత్రం ఎద్దేవా చేసేలా మాట్లాడుతున్నారని తప్పుబడుతున్నారు. తెలంగాణ తరఫున సమస్యలు పరిష్కారమయ్యేలా ఏపీ అధికారులపై ఒత్తిడి తెస్తున్న ఆయన రెండు రాష్ట్రాల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రెండు రాష్ట్రాలూ కలిసి కూర్చుని పరిష్కరించుకునే సమన్వయం, సామరస్యమే ఉంటే ఇక ఇన్నిసార్లు ఇంతమంది గవర్నర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని నిలదీస్తున్నారు.