Begin typing your search above and press return to search.

ప్రభుత్వ వాహనం పార్ట్స్ లూఠీ .. బాడీ మాత్రమే.. ఆ సినిమాను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో?

By:  Tupaki Desk   |   31 March 2021 5:00 AM IST
ప్రభుత్వ వాహనం పార్ట్స్ లూఠీ .. బాడీ మాత్రమే.. ఆ సినిమాను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో?
X
మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ది బెస్ట్ ఎంటర్టైనర్ ఖలేజా సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో మహేష్ , అనుష్క , సునీల్ , అలీ కలిసి ఎడారిలో వెళ్తున్న సమయంలో వారికి స్థానికులు కడుపు నిండా భోజనం పెడతారు. వారు తిని చేతులు కడుక్కుని చూసేసరికి ఆలీ బస్సులో పార్టులన్నీ మాయం అయిపోయి బాడీ మాత్రమే మిగులుతుంది.ఆ సినిమాను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ, సేమ్ సీన్ ను రిపీట్ చేశారు. వాహనం పార్ట్స్ ను లూఠీ చేసి కేవలం బాడీ ని మాత్రమే ఉంచారు.

ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన నర్సరీలో. ప్రభుత్వ వాహనంలోని టైర్లు, సీట్లు, లైట్లతో సహా అన్ని పార్టులు కొట్టేసిన దుండగులు బాడీని మాత్రం మిగిల్చారు. సినీ ఫక్కీలో జరిగిన ఆ చోరీని చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖకు చెందిన నర్సరీలో వివిధ అవసరాల కోసం అధికారులు టాటా ఏస్ వాహనాన్ని కొనుగోలు చేశారు. మొక్కలు, పనిముట్లు తీసుకురావడం, కూలీలను తరలించడం కోసం ఈ వాహనాన్ని ఉపయోగించేవారు. ప్రస్తుతం నర్సరీలో పనులేమీ లేకపోవడంతో వాహనాన్ని కొద్దిరోజులు నర్సరీలోనే ఓ పక్కన వదిలేశారు.

అయితే రెండ్రోజుల క్రితం ఆ వాహనాన్ని గమనించిన అధికారులకు దిమ్మతిరిగింది. వాహనంలోని అన్ని పార్టులు దొంగించిన వ్యక్తులు కేవలం బాడీని మాత్రమే మిగిల్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియపరచగా.. వారి సలహా మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం వాహనాన్ని దొంగిలిస్తే ఈజీగా దొరికిపోతామన్న భయంతోనే దొంగలు తెలివిగా దాని పార్టులు మాత్రమే తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పని చేసింది ఇంటి దొంగలేనా , లేక బయట దొంగలా అనే దాన్ని తేల్చే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.