Begin typing your search above and press return to search.

లీటర్ పెట్రోల్ రూ.19 ఉండాలంటున్న కాంగ్రెస్

By:  Tupaki Desk   |   17 Jan 2016 4:52 PM IST
లీటర్ పెట్రోల్ రూ.19 ఉండాలంటున్న కాంగ్రెస్
X
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధి కాస్తా చేజారిన తర్వాత మరోలా మాట్లాడటం రాజకీయ పార్టీలకు మామూలే. అధికారంలో ఉన్నప్పుడు కనిపించని అంశాలు.. పవర్ చేజారిన వెంటనే గుర్తుకు వస్తాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలు చూస్తే ఇది నిజం అనిపించక మానదు. అంతర్జాతీయ పరిణామాల్లో చోటు చేసుకున్న మార్పులతో బ్యారెల్ క్రూడాయిల్ ధర 30 డాలర్ల కంటే దిగువకు చేరుకున్న సంగతి తెలిసిందే.

దశాబ్దం తర్వాత ఇంత భారీగా పడిన క్రూడాయిల్ ధరల కారణంగా లీటరు పెట్రోల్ రూ.19 మాత్రమే ఉండాలని.. డీజిల్ రూ.15 ఉండాలని వాదిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ.. ఈ విషయాన్ని పట్టించుకోకుండా మోడీ సర్కారు ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోందని విరుచుకుపడుతోంది. లీటరు రూ.19తీసుకోవాల్సింది జనం జేబుల్లో నుంచి లీటరు పెట్రోల్ కు రూ.59 (ఢిల్లీ రేటు) వసూలు చేస్తున్నట్లు మండి పడుతోంది.

మరోవైపు.. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై కమలనాథులు అస్సలు విననట్లే ఉంటున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అధికారంలో ఉన్న సమయంలో ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. తాజాగా బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు అధికారంలో ఉన్న సమయంలో నిత్యవసర వస్తువులు మొదలు.. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ ఊసే ఎత్తటం లేదు. అధికారం ఏ పార్టీ చేతిలో ఉన్నా జనాన్ని పట్టించుకోదన్న విషయం మరోసారి రుజువైంది.