Begin typing your search above and press return to search.

దావోస్ కు క్యూ కడుతున్న ప్రభుత్వాధినేతలు

By:  Tupaki Desk   |   25 April 2022 11:30 AM GMT
దావోస్ కు క్యూ కడుతున్న ప్రభుత్వాధినేతలు
X
వచ్చే నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ప్రభుత్వాధినేతలు క్యూ కడుతున్నారు. స్విట్జంర్లాండ్ లోని దావోస్ లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగే విషయం అందరికీ తెలిసిందే. ఈ సదస్సులో ప్రపంచ దేశాల అధినేతలు, ప్రపంచ ప్రఖ్యాతిచెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. ఈ సదస్సులో తమ దేశాలకు లేదా రాష్ట్రాలకు పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించటమే ధ్యేయంగా దేశాధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజంటేషన్ ఇస్తారు.

దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు నిజానికి పెట్టుబడుల ఆకర్షణకు మంచివేదికనే చెప్పాలి. ఇలాంటి సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, తెలంగాణా మంత్రి కేటీయార్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తదితరులు హాజరై తమ ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికలను వివరించబోతున్నారు.

దేశం నుండి కనీసం 100 మంది సీఈవోలు కూడా హాజరవ్వబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాల అధినేతలు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సుమారు 300 మంది ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన వారసులు ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, బజాజ్ ఫిన్ సర్వ్ ఛైర్మన్ సంజీవ్ బజాజ్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళం బిర్లా, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, సీరం సంస్ధ ఛైర్మన్ అదర్ పూనావాలా+హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, పేటిఎం, యాక్సిస్ బ్యాంక్ లాంటి అనేక సంస్ధల అధినేతలు కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు.

400కు పైగా జరిగే సెషన్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సుమారు 2 వేలమంది పాల్గొనే అవకాశముందని సదస్సు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. జీ7, జీ 20 కూటమికి చెందిన దేశాల ప్రతినిధులు కూడా హాజరవబోతున్నారు.

హాజరవబోతున్న ప్రముఖుల జాబితాను చూస్తేనే ఈ సదస్సుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్ధమైపోతోంది. మరి ఈ సదస్సుకు జగన్ కూడా హాజరవుతున్న కారణంగా రాష్ట్రానికి ఏమన్నా లాభం ఉంటుందేమో చూడాలి.