Begin typing your search above and press return to search.

డీఐఎన్ ఎంట్రీ...ఐటీ వేధింపులకు చెల్లుచీటేనా?

By:  Tupaki Desk   |   2 Oct 2019 9:03 PM IST
డీఐఎన్ ఎంట్రీ...ఐటీ వేధింపులకు చెల్లుచీటేనా?
X
అధికార పార్టీలకు గిట్టని రాజకీయ నేతలు - అధికారులకు ఇప్పటిదాకా జారీ అవుతున్న ఆదాయపన్ను శాఖ నోటీసులకు సంబంధించి ఇప్పుడు ఓ కొత్త నిబంధన ఎంట్రీ ఇచ్చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ కొత్త తరహా నిబంధనలతో ఐటీ శాఖ బెదిరింపులు - వేధింపులకు చెక్ పడినట్టేనన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనను అధికారంలో ఉన్న పార్టీలు - వాటి ఆధ్వర్యంలో పనిచేసే ఐటీ శాఖ అధికారులను కట్టడి చేస్తాయా? అంటే... ఏమో మరి వేచి చూస్తే గానీ ఈ అనుమానాలకు జవాబు దొరకదన్న వాదన కూడా వినిపిస్తోంది.

సరే.. మరి ఇప్పుడు ఐటీ శాఖ నోటీసులకు సంబంధించి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఆదేశాలు ఏమిటన్న విషయానికి వస్తే... ఇకపై ఐటీ శాఖకు సంబంధించిన అన్ని నోటీసులు కంప్యూటర్ ఉత్పాదిత డాక్యుమెంట్ గుర్తింపు సంఖ్య (డీఐఎన్)‌తో రానున్నాయట. డీఐఎన్ లేని నోటీసులను ఇకపై చెల్లనివిగా గుర్తించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన చేశారు. నిన్నటి (అక్టోబర్ 1) నుంచే ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు. తాజాగా అమలు చేస్తున్న విధానం ద్వారా పన్ను చెల్లింపుదారులకు ఐటీ అధికారుల నుంచి ఎదురయ్యే వేధింపులకు చెక్ పెట్టవచ్చునని... డీఐఎన్ ద్వారా అన్ని అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలపై అధికారులు జవాబు చెప్పాల్సిఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ప్రతినిధి వెల్లడించారు.

ఐటీ శాఖకు చెందిన అంచనాలు - అప్పీళ్లు - ఆదేశాలు - మినహాయింపులు - విచారణ - దర్యాప్తు - సమాచార పరిశీలన - జరిమానా - అభియోగాలు - సవరణలు - ఆమోదం తదితర అంశాలు సహా అక్టోబర్ 1 తర్వాత ఐటీ శాఖ నుంచి వెలువడే అన్ని పత్రాలపై ఆడిట్ ట్రయల్స్ ఉంటాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. డీఐఎన్ వ్యవస్థ ద్వారా పన్ను పాలనలో పారదర్శకత - పూర్తి జవాబుదారీతనం వస్తుందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప డీఐఎన్ లేకుండా చేతిరాతతో సంప్రదింపులు సాగించే అవకాశమే లేదని కూడా సదరు ఉత్తర్వుల్లో ఆర్థిక శాఖ పేర్కొంది. ఒకవేళ చేతితో ఏదైనా పత్రాలు రాయాల్సి వస్తే.. వాటిని 15 రోజుల్లోగా సిస్టమ్ పోర్టల్‌ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందట. పన్ను చెల్లింపు దారులపై ఎలాంటి వేధింపులు లేకుండా మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన ప్రమాణాలను ప్రవేశపెట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే తాజా విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఐటీ శాఖ వెల్లడించింది.